ఇరాన్‌తో చర్చలు కొనసాగుతున్నాయి: ట్రంప్
న్యూయార్క్ : అగ్రరాజ్యం అమెరికా, ఇరాన్ దేశాల మధ్య చర్చలు నిలిచిపోయాయంటూ వస్తున్న వార్తలను అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తీవ్రంగా ఖండించారు. ఆ వార్తల్లో ఎలాంటి నిజం లేదని స్పష్టం చేశారు. ఇరు దేశాల మధ్య చర్చలు నిరంతరాయంగా సాగుతున్నాయని అన్నారు. చర్చలు ఏ తీరానికి చేరుకుంటాయో ఎవరూ ఊహించలేరని పేర్కొన్నారు. ఈ మేరకు ట్రంప్ తన సొంత సోషల్ మీడియా ప్లాట్ ఫామ్ ‘ది ట్రూత్ సోషల్’లో మంగళవారం ఓ పోస్టు పెట్టారు. ఆ పోస్టులో.. ‘ఇస్లామిక్ రిపబ్లిక్ ఆఫ్ ఇరాన్, అమెరికా దేశాల మధ్య చర్చలు నిలిచిపోయాయంటూ వస్తున్న వార్తల్లో ఎలాంటి నిజం లేదు. రెండు దేశాల మధ్య చర్చలు నిరంతరాయంగా జరుగుతూనే ఉన్నాయి. నాలుగు రోజుల క్రితం, మూడు రోజుల క్రితం, రెండు రోజుల క్రితం, నిన్న , ఈరోజు కూడా చర్చలు జరిగాయి. ఈ చర్చలు ఎక్కడికి దారితీస్తాయో ఎవరికీ తెలియదు. ఒప్పందం చేసుకోవడానికి ఇరాన్‌కు ఇదే సరైన సమయం. ఇరాన్ 47 ఏళ్లుగా ఒప్పందాన్ని సాగదీస్తోంది. ఇకపై దీన్ని ఇలాగే కొనసాగించడానికి అనుమతించబోము’ అని తేల్చి చెప్పారు.










Comments