కొత్త ఆర్థిక సంవత్సరానికి శుభారంభం
ముంబై: కొత్త ఆర్థిక సంవత్సరానికి ఈక్విటీ మార్కెట్ శుభారంభం ఇచ్చింది. రెండు రోజుల వరుస భారీ పతనాలకు తెర దించింది. రిలీఫ్ ర్యాలీతో మార్కెట్ ఊపిరి పీల్చుకుంది. సెన్సెక్స్ 1,186.77 పాయింట్ల లాభంతో 73,134.32 వద్ద ముగిసింది. ఇంట్రాడేలో సెన్సెక్స్ 2000 పాయింట్లకు పైగా లాభపడి 73,964.58 పాయింట్ల గరిష్ఠాన్ని తాకింది. నిఫ్టీ 348 పాయింట్ల లాభంతో 22,679.40 వద్ద ముగిశాయి. ఈ ర్యాలీతో బీఎ్‌సఈ లిస్టెడ్ కంపెనీల షేర్ల మార్కెట్ విలువ (ఇన్వెస్టర్ల సంపద) బుధవారం రూ.9.60 లక్షల కోట్లు పెరిగి రూ.422 లక్షల కోట్లకు చేరింది. పశ్చిమాసియా యుద్ధానికి త్వరలో తెర పడుతుందనే సంకేతాలు, బ్యారెల్ ముడి చమురు ధర 100 డాలర్ల దిగువకు రావడం, ప్రధాన అంతర్జాతీయ మార్కెట్లు లాభాల్లో ట్రేడవడం బుధవారం దేశీయ స్టాక్ మార్కెట్లో ర్యాలీకి దోహదపడ్డాయి. ప్రస్తుత సానుకూల వాతావరణంలో గురువారంనాడు కూడా ఈ ర్యాలీ కొనసాగే అవకాశం ఉందని మార్కెట్ వర్గాల అంచనా.
ఐపీఓలకు కంపెనీల ఉత్సాహం: సెకండరీ మార్కెట్ గత కొద్ది రోజులుగా భారీ ఆటుపోట్లకు లోనవుతున్నా ఐపీఓల జారీకి కంపెనీలు ఉత్సాహపడుతున్నాయి. 2026 ఆర్థిక సంవత్సరం చివరి రెండు రోజుల కాలంలోనే రెండు డజన్లకు పైగా కంపెనీలు ఐపీఓ జారీకి అనుమతి కోరుతూ సెబీకి దరఖాస్తు చేయడమే ఇందుకు నిదర్శనం.
మళ్లీ బులియన్ మెరుపులు
అంతర్జాతీయ మార్కెట్ల నుంచి అందిన బలమైన సంకేతాలతో బులియన్ మార్కెట్ బుధవారం కళకళలాడింది. ఢిల్లీ మార్కెట్లో కిలో వెండి ధర రూ.9,000 పెరిగి రూ.2.46 లక్షలు పలికింది. 10 గ్రాముల మేలిమి బంగారం రూ.3,500 పెరిగి రూ.1.55 లక్షల వద్ద స్థిరపడింది. అంతర్జాతీయ మార్కెట్లో ఔన్సు బంగారం ధర 76.51 డాలర్లు పెరిగి 4743.89 డాలర్లకు చేరింది. అయితే వెండి ధర మాత్రం స్వల్పంగా తగ్గి 75.04 డాలర్లుగా నమోదయింది.










Comments