గూగుల్‌కు ‘డీమ్డ్ డిస్కం’ హోదా
అమరావతి : విశాఖపట్నంలో ఏర్పాటుకానున్న గూగుల్ డేటా సెంటర్‌కు ‘డీమ్డ్ డిస్కం’ హోదా ఇవ్వాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. రానున్న రోజుల్లో రాష్ట్రానికి మరిన్ని డేటా సెంటర్లను ఆకర్షించేందుకు 300 మెగావాట్ల సామర్థ్యానికి మించి ఉండే డేటా సెంటర్లన్నింటికీ డీమ్డ్ డిస్కం హోదా ఇవ్వాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఇటీవల జరిగిన క్యాబినెట్ సమావేశంలో ఈమేరకు నిర్ణయం తీసుకున్నారు. దీనిపై త్వరలోనే అధికారిక ఉత్తర్వులు ఇవ్వనున్నట్లు ఇంధన శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి విజయానంద్ తెలిపారు. గూగుల్ డేటాసెంటర్ నిరంతరాయంగా నడవాలంటే దానికి 1 గిగావాట్ విద్యుత్తు అవసరం ఉంటుంది. దీన్ని గ్రిడ్ నుంచి తీసుకుంటే ఖర్చు అధికంగా అవుతుంది. ఈ కారణంగా గూగుల్ డేటా సెంటర్ సొంతంగా తన విద్యుత్తు అవసరాలను తీర్చుకునే వెసులుబాటు కల్పించాలని ప్రభుత్వం నిర్ణయించింది. దీంతో గూగుల్ అనుబంధ సంస్థ అయిన రైడెన్ ఇన్ఫోటెక్ ద్వారా డీమ్డ్ డిస్ట్రిబ్యూషన్ (డీమ్డ్ డిస్కం) లైసెన్సును పొందనుంది. రాష్ట్రంలో ఈ హోదా పొందిన తొలి ప్రైవేటు సంస్థ ఇదే. ఈ హోదాతో గూగుల్ కంపెనీకి రాష్ట్రంలోనే కాకుండా దేశం నలుమూలల నుంచి విద్యుత్తును కొనుగోలు చేసే అవకాశం లభిస్తుంది. కొనుగోలు చేసిన విద్యుత్తును తెచ్చుకునేందుకు సొంతంగా ట్రాన్స్‌మిషన్ లైన్లను గూగుల్ ఏర్పాటు చేసుకోవాల్సి ఉంటుంది.
ఒకవేళ రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధించిన ట్రాన్స్‌మిషన్ లైన్లను వినియోగించుకుంటే దానికి తగిన మొత్తాన్ని చెల్లించాల్సి ఉంటుంది. అయితే గూగుల్ కొనుగోలు చేసే మొత్తం విద్యుత్తులో 51 శాతం రెన్యూవబుల్ ఎనర్జీ సోర్సుల (సోలార్, విండ్, హైడల్) నుంచే కొనుగోలు చేయాలనే నిబంధనను ప్రభుత్వం విధించింది. డీమ్డ్ డిస్కం హోదా వల్ల గూగుల్‌కి పవర్ డిస్ట్రిబ్యూటర్‌గా పనిచేసే అవకాశం కూడా ఉంటుంది. అంటే అది నేరుగా ఉత్పత్తిదారుల నుంచి విద్యుత్తు కొనుగోలు చేయడమే కాకుండా సొంత వనరుల ద్వారా దాన్ని సరఫరా కూడా చేసుకోవచ్చు. డీమ్డ్ డిస్కం హోదా రాకముందు విశాఖ, తర్లువాడ, రాంబిల్లిలోని మూడు సైట్లకు సుమారు 540 మెగావాట్ల విద్యుత్తును ఏపీఈపీడీసీఎల్ నుంచి ఇవ్వాలని గూగుల్ డీమ్డ్ డిస్కం హోదా రావడంతో ఇకపై ఈపీడీసీఎల్ నుంచి విద్యుత్తును పొందే అవసరం గూగుల్‌కు ఉండదు.









Comments