• Jun 05, 2026
  • NPN Log

    గుంటూరు  : విద్యార్థుల తలరాతను చేతిరాత ద్వారా మార్చి వారి భవిష్యత్తును ఉజ్వలంగా తీర్చిదిద్దుతున్నారు ప్రభుత్వ టీచరు ఉప్పాల రామ్మోహనరావు. చేతిరాతను ఒక ఉద్యమంలా ఆయన నిర్వహిస్తూ జాతీయస్థాయిలో గుర్తింపు పొందుతున్నారు. తన ఉద్యమంలో భాగంగా తొలుత ఉపాధ్యాయులకు ఒకరోజు చేతిరాత (దస్తూరి) శిక్షణ ఇస్తారు. వారిని బృందాలుగా ఏర్పాటుచేసి వేలాదిమంది విద్యార్థుల వద్దకు పంపుతున్నారు. పైసా ఆశించకుండా ఆయన ఈ పని చేస్తుండటం గమనార్హం. గుంటూరు రూరల్‌ మండలం పొత్తూరు జడ్పీ స్కూల్‌లో ఉప్పాల రామోహనరావు గణిత ఉపాధ్యాయునిగా పనిచేస్తున్నారు. చేతిరాతలో ఇప్పటివరకు ఆయన 85 వేల మందికిపైగా విద్యార్థులకు శిక్షణ అందించారు. తన మిత్రుడు తొరటి శ్రీనివాసరావు సలహా మేరకు 2019 ఆగస్టు 12న క్యాలిగ్రఫీ ఉద్యమాన్ని ఉప్పాల ప్రారంభించారు. ‘రాయడం’ అనే నైపుణ్యం గ్రామీణ ప్రాంతాల్లోని ప్రభుత్వ పాఠశాలల్లోని పేద విద్యార్థులకు అలవర్చాలని సంకల్పించారు. దీనికోసం అక్కడ పనిచేస్తున్న ఉపాధ్యాయులను వాహికగా చేసుకున్నారు. తొలుత 32 మంది ప్రభుత్వ ఉపాధ్యాయులకు క్యాలిగ్రాఫర్‌ శ్రీనివాసరావుతో శిక్షణ కార్యక్రమాన్ని గుంటూరులో ఇప్పించారు. ఇందులోభాగంగా ప్రతి ఉపాధ్యాయునికి హ్యాండ్‌ రైటింగ్‌ కిట్‌ ఉచితంగా అందజేశారు. మొదటి రెండు సంవత్సరాలు తండ్రి జ్ఞాపకార్థం నోట్‌ బుక్స్‌ ప్రింట్‌ చేయించి శిక్షణకు హాజరైన ప్రతి టీచర్‌కూ 10 పుస్తకాలు ఇచ్చారు. శిక్షణ పొందిన ప్రతి ఉపాధ్యాయుడు వారి పాఠశాలలో 10 మంది విద్యార్థులను దత్తత తీసుకునేలా చేసి, వారి కోసం ఒక వాట్సాప్‌ గ్రూప్‌ క్రియేట్‌ చేసి ప్రతిరోజు సూచనలు చేస్తూ ఒక ఉద్యమంగా సాగించారు.

    శిక్షణలో నైపుణ్యం సాధించిన 72 మంది ఉపాధ్యాయులతో క్యాలిగ్రఫీ టీమ్‌ను ఏర్పాటు చేశారు. ఈ టీమ్‌తో రాష్ట్రవ్యాప్తంగా ఉన్న పలు పాఠశాలల్లోని విద్యార్థులకు శిక్షణ ఇప్పించారు. ఇప్పటి వరకు 144 శిక్షణ తరగతుల ద్వారా 6,500 మంది ప్రభుత్వ ఉపాధ్యాయులకు, 85 వేల మంది పైబడి విద్యార్థులకు అందమైన దస్తూరీ శిక్షణ అందించామని ఉప్పాల మోహనరావు ‘ఆంధ్రజ్యోతి’కి వివరించారు. రాయడమంటే కేవలం అక్షరాలు కూర్చడం కాదని, అదొక మానసిక వ్యాయామమని ఆయన నమ్ముతారు. రాతతో మెదడులో కొత్త నాడీ సంబంధాలు (న్యూరోప్లాస్టిసిటీ), మెరుగైన జ్ఞాపక శక్తి, ఏకాగ్రత, భావ నియంత్రణ వంటివి అలవడతాయని ఆయన విశ్వసిస్తారు. ఉప్పాల సేవలను గుర్తించిన ప్రభుత్వం జిల్లా స్థాయిలో ఉత్తమ ఉపాధ్యాయ అవార్డుతోపాటు రాష్ట్ర, జాతీయ స్థాయిలో అవార్డులు అందజేసి గౌరవించింది. చేతి రాత ఉద్యమానికి ప్రెస్‌, మీడియా, సామాజిక మాధ్యమాల ద్వారా ఉప్పాల విస్తృత ప్రచారం కల్పిస్తున్నారు.

     

    You Might Also Like

    Comments

    Leave A Comment

    Don’t worry ! Your email address will not be published. Required fields are marked (*).

    Featured News

    Advertisement