• Jun 05, 2026
  • NPN Log

    న్యూఢిల్లీ : దేశంలోని అత్యంత ప్రతిష్ఠాత్మకమైన ఐఐటీల్లో ప్రవేశాల కోసం నిర్వహించిన జేఈఈ అడ్వాన్స్‌డ్‌ 2026 ఫలితాలు విడుదల అయ్యాయి. ఐఐటీ రూర్కీ సోమవారం ఉదయం ఈ ఫలితాలను విడుదల చేసింది. విద్యార్థులు తమ స్కోర్‌ కార్డులను జేఈఈ అడ్వాన్స్‌డ్‌ పోర్టల్‌ ద్వారా డౌన్‌లోడ్‌ చేసుకోవచ్చని అధికారులు తెలిపారు. ఈ ఏడాది ఫలితాల్లో ఐఐటీ ఢిల్లీ జోన్‌ అద్భుతమైన ప్రతిభ కనబరిచి టాప్‌-3 ర్యాంకులను సొంతం చేసుకుంది. బిహార్‌లోని గయ ప్రాంతానికి చెందిన శుభమ్‌ కుమార్‌ 360కి గాను 330 మార్కులు సాధించి ఆల్‌ ఇండియా ఫస్ట్‌ ర్యాంక్‌ కైవసం చేసుకున్నారు. కేవలం ఒక్క మార్కు తేడాతో గురుగ్రామ్‌కు చెందిన కబీర్‌ చిల్లార్‌ (329) రెండో స్థానంలో నిలవగా, జతిన్‌ చాహర్‌ (319) మూడో ర్యాంకును దక్కించుకున్నారు. ఇక అమ్మాయిల విభాగంలో ఐఐటీ ఢిల్లీ జోన్‌కే చెం దిన ఆరోహి దేశ్‌పాండే 280 మార్కులతో జాతీయ స్థాయిలో టాపర్‌గా నిలిచారు. ఆమె కామన్‌ ర్యాంక్‌ లిస్టులో 77వ స్థానాన్ని దక్కించుకోవడం గమనార్హం. ఈ ఫలితాల్లో తెలుగు విద్యార్థులు కూడా సత్తాచాటారు. జాతీయ స్థాయి టాప్‌-10 ర్యాంకుల్లో ముగ్గురు తెలుగు విద్యార్థులు నిలిచి రికార్డు సృష్టించారు. హైదరాబాద్‌కు చెందిన మోహిత్‌ శేఖర్‌ శుక్లా 319 మార్కులతో ఆల్‌ ఇండియా 4వ ర్యాంకు సాధించి తెలంగాణ, ఐఐటీ మద్రాస్‌ జోన్‌ టాపర్‌గా నిలిచారు. కూచి సందీప్‌ 5వ ర్యాంక్‌, మెడిశెట్టి నాగ సహర్ష 9వ ర్యాంకు సాధించారు. అలాగే, కామారెడ్డికి చెందిన తోట సాయి వినీల్‌ అనే విద్యార్థి ఆలిండియా స్థాయి లో 24వ ర్యాంకు సాధించాడు. సాయికి ఈడబ్ల్యూఎస్‌ కోటాలో రెండో ర్యాంక్‌ వచ్చింది. ఇక, కామారెడ్డి జిల్లా గాంధారి మండలానికి చెందిన బర్మావత్‌ కార్తీ క్‌ అనే విద్యార్థికి జనరల్‌ కేటగిరీలో 3500వ ర్యాంకు, ఎస్టీ కేటగిరీలో 20వ ర్యాంకు వచ్చిందని కుటుంబసభ్యులు తెలిపారు. రంగారెడ్డి జిల్లా కొత్తూర్‌ తండాకు చెందిన పాత్లావత్‌ గౌతమ్‌ అనే విద్యార్థికి ఎస్టీ కేటగిరీలో 73వ ర్యాంకు వచ్చినట్టు కుటుంబసభ్యులు చెప్పారు. వీరితో పాటు ఏపీలోని పల్నాడు జిల్లా నూజెండ్ల మండలం సాయినగర్‌ గ్రామానికి చెందిన బిజ్జం వెంకట చంద్రశేఖర్‌ రెడ్డి 38వ ర్యాంకు, విజయనగరం జిల్లా బొబ్బిలికి చెందిన కాతా హిమకర్‌ ఓపెన్‌ కేటగిరీలో 40వ ర్యాంకు కైవసం చేసుకున్నారు.

    జోన్ల వారీగా చూస్తే ఐఐటీ మద్రాస్‌ జోన్‌ తన హవాను చాటుకుంటూ అత్యధికంగా 14,294 మంది విద్యార్థులను క్వాలిఫై చేసింది. ఆ తర్వాతి స్థానాల్లో ఐఐటీ బాంబే, ఐఐటీ ఢిల్లీ జోన్లు నిలిచాయి. మే 17న దేశవ్యాప్తంగా జరిగిన ఈ పరీక్షకు మొత్తం 1,87,389 మంది రిజిస్టర్‌ చేసుకోగా, 1,79,694 మంది విద్యార్థులు హాజరయ్యారు. వీరిలో 56,880 మంది విద్యార్థులు ఐఐటీ సీట్ల పోటీకి అర్హత సాధించారు. ఉత్తీర్ణులైన వారిలో 46,773 మంది పురుషులు ఉండగా, 10,107 మంది మహిళా అభ్యర్థులు ఉన్నారు. ఈ పరీక్షలో అర్హత సాధించిన విద్యార్థులకు ఐఐటీలు, ఎన్‌ఐటీలతో పాటు దేశంలోని ఇతర ప్రముఖ ఇంజనీరింగ్‌ కాలేజీల్లో సీట్ల కేటాయింపు కోసం జాయింట్‌ సీట్‌ అలొకేషన్‌ అఽథారిటీ (జోసా) త్వరలోనే కౌన్సెలింగ్‌ ప్రక్రియను ప్రారంభించనుంది. కాగా, సోషల్‌ మీడియాకు పూర్తిగా దూరంగా ఉండడమే తమను విజయతీరాలకు చేర్చిందని టాప్‌ ర్యాంకర్లు శుభమ్‌ కుమార్‌, కబీర్‌ చిల్లార్‌ తెలిపారు.

     

    You Might Also Like

    Comments

    Leave A Comment

    Don’t worry ! Your email address will not be published. Required fields are marked (*).

    Featured News

    Advertisement