తెలుగోడిపై రోహిత్ శర్మ ఇంట్రెస్టింగ్ కామెంట్స్
ఆస్ట్రేలియాపై జరిగిన తొలి వన్డే మ్యాచ్ ద్వారా టీమిండియా యంగ్ ప్లేయర్, హైదరాబాద్ కుర్రాడు నితీష్ కుమార్ రెడ్డి ఇంటర్నేషనల్ వన్డే క్రికెట్లోకి అరంగేట్రం చేశాడు. హిట్ మ్యాన్ రోహిత్ శర్మ చేతుల మీదుగా డెబ్యూ క్యాప్ ను నితీష్ అందుకున్నాడు. ఈ సందర్భంగా తెలుగు కుర్రాడు నితీష్‌ను రోహిత్ ప్రశంసించాడు.
ఆల్‌రౌండర్ నితీష్ కుమార్ రెడ్డికి భారత వన్డే క్రికెట్‌లో 260వ క్యాప్ లభించింది. ఈ డెబ్యూ సమయంలో నితీష్‌ను ఉద్దేశించి మాట్లాడిన రోహిత్.. అతడిలో ఆటపై ఉన్న పట్టుదల, కసిని చూశాక తనకు సానుకూల అభిప్రాయం ఏర్పడిందని తెలిపాడు. రోహిత్ మాటల్లో నితీష్ పై తనకు ఉన్న విశ్వాసం కనిపించింది.
రోహిత్ మాట్లాడుతూ..'క్యాప్ నంబర్ 260తో టీమిండియా క్లబ్‌లోకి నితీష్ రెడ్డికి స్వాగతం. మీ కెరీర్ చాలా అద్భుతంగా ప్రారంభమైంది. మీలో ఉన్న ఈ గొప్ప వైఖరి కారణంగా, మీరు భారత జట్టులో చాలా ముందుకు సాగుతారని నాకు వంద శాతం నమ్మకం ఉంది. నితీష్ కేవలం వన్డేల్లోనే కాకుండా, అన్ని ఫార్మాట్‌లలో మంచి ప్లేయర్ గా ఎదుగుతారని నేను విశ్వసిస్తున్నాను. మీరు అన్ని ఫార్మాట్స్ లో ఉండాలని కోరుకుంటున్నాను. మీ కెరీర్‌ను అద్భుతంగా తీర్చిదిద్దడానికి జట్టులోని ప్రతి ఒక్కరం మీకు మద్దతు ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాము' అని రోహిత్ శర్మ అన్నాడు. ఇక పెర్త్ వేదికగా ఆస్ట్రేలియాతో జరిగిన తొలి వన్డేలో చివరి ఓవర్లల్లో నితీష్ అదరగొట్టాడు. చివర్లో బౌండరీలు కొట్టి ఆకట్టుకున్నాడు. అయితే తొలి వన్డేలో భారత్ ఓడిన సంగతి తెలిసిందే.
Comments