• Jun 05, 2026
  • NPN Log

    హైదరాబాద్‌ : రాష్ట్ర అవతరణ దినోత్సవం సందర్భంగా మంగళవారం 3 నోటిఫికేషన్లు ప్రకటిస్తామని ఇందులో రోడ్లు భవనాల శాఖలో ఏఈఈ 222, సివిల్‌ 49 ఉద్యోగాలున్నాయని తెలంగాణ పబ్లిక్‌ సర్వీస్‌ కమిషన్‌(టీజీపీఎస్సీ) అధ్యక్షుడు బుర్రా వెంకటేశం తెలిపారు. వివిధ ప్రభుత్వ శాఖల్లో 3800 ఉద్యోగాల భర్తీకి ఆర్థికశాఖ అనుమతి ఇచ్చిందని, వీటి భర్తీకి త్వరలో నోటిఫికేషన్లు ఇస్తామన్నారు. ఇక నుంచి పరీక్షలన్నీ కంప్యూటర్‌(సీబీటీ) విధానంలో నిర్వహించేందుకు కసరత్తులు చేస్తున్నామని, ప్రశ్నాపత్రాన్ని అదేరోజు లేదా ఒక రోజు ముందు నిపుణులతో సిద్ధం చేస్తామన్నారు. ప్రశ్నాపత్రం ఎవరు సిద్ధం చేస్తున్నారన్న విషయం తనకు తప్ప మరెవరికీ తెలియకుండా గోప్యత పాటిస్తామన్నారు. సీబీటీ విధానంలో నిర్వహించే పరీక్ష మార్కులు పరీక్ష పూర్తయిన వెంటనే కంప్యూటర్‌ స్ర్కీన్‌పై వస్తుందని వివరించారు. నోటిఫికేషన్‌ విడుదల నుంచి పరీక్ష నిర్వహణ, ఫలితాలు, మెరిట్‌ జాబితా ప్రకటనలో పూర్తి పారదర్శకత పాటిస్తామన్నారు. టీజీపీఎస్సీ సభ్యులు ఆచార్య లక్ష్మీకాంత రాథోడ్‌, అమీరుల్లా ఖాన్‌, విశ్వప్రసాద్‌, చంద్రకాంత్‌ రెడ్డి, కార్యదర్శి హరితలతో కలిసి బుర్రా వెంకటేశం తన కార్యాలయంలో మీడియా సమావేశం నిర్వహించారు. 34 ప్రభుత్వ శాఖల్లో ఖాళీల భర్తీకి 3800 పోస్టులకు ఆర్థికశాఖ అనుమతి ఇచ్చిందని, వీటి భర్తీకి ప్రతినెలా 2 లేదా 3 నోటిఫికేషన్లు ఇస్తామన్నారు. ఈనెలలో మరో 3 నోటిఫికేషన్లు విడుదల చేస్తామని తెలిపారు. ఒకే పరీక్షతో ఉద్యోగులను ఎంపికచేసే పరీక్షలన్నీ ఇకనుంచి 3 నుంచి 6 నెలల్లోపు పూర్తిచేయాలని నిర్ణయించామన్నారు. అలాగే ప్రిలిమ్స్‌, మెయిన్స్‌ లాంటి రెండు పరీక్షలున్నవి 6 నుంచి 9 నెలల్లోపు, దశలవారీగా నిర్వహించే పరీక్షలు(మల్టీస్టేజెస్‌) నోటిఫికేషన్‌ విడుదల చేసినప్పటి నుంచి గరిష్ఠంగా 12నెలల్లోపు పూర్తి చేస్తామన్నారు.

     

     

    You Might Also Like

    Comments

    Leave A Comment

    Don’t worry ! Your email address will not be published. Required fields are marked (*).

    Featured News

    Advertisement