• Apr 15, 2026
  • NPN Log

    చెన్నై: మాజీ చాంపియన్‌ కోల్‌కతా నైట్‌రైడర్స్‌ పరాజయాల పరంపర కొనసాగుతూనే ఉంది. అటు సొంతగడ్డపై చెన్నై సూపర్‌ కింగ్స్‌ మరోసారి చక్కటి ప్రదర్శనతో ఆకట్టుకుంది. మంగళవారం జరిగిన ఈ మ్యాచ్‌లో బ్యాటు, బంతితో అదరగొట్టిన చెన్నై 32 పరుగులతో కోల్‌కతాపై గెలిచింది. మరోవైపు నైట్‌రైడర్స్‌ ఆడిన ఐదు మ్యాచ్‌ల్లోనూ నాలుగింట్లో ఓడగా.. ఓ మ్యాచ్‌ రద్దయ్యింది. ముందుగా చెన్నై 20 ఓవర్లలో 5 వికెట్లకు 192 పరుగులు చేసింది. సంజూ శాంసన్‌ (32 బంతుల్లో 4 ఫోర్లు, 3 సిక్సర్లతో 48), బ్రెవిస్‌ (29 బంతుల్లో 4 ఫోర్లు, 2 సిక్సర్లతో 41), ఆయుష్‌ మాత్రే (17 బంతుల్లో 6 ఫోర్లు, 2 సిక్సర్లతో 38) రాణించారు. కార్తీక్‌ త్యాగికి రెండు వికెట్లు దక్కాయి. ఛేదనలో కోల్‌కతా 20 ఓవర్లలో 160/7 స్కోరుకే పరిమితమై ఓడింది. రమణ్‌దీప్‌ (23 బంతుల్లో 4 ఫోర్లు, 1 సిక్స్‌తో 35), పోవెల్‌ (31 నాటౌట్‌), రహానె (28), రఘువంశీ (27) ఫర్వాలేదనిపించారు. 3 వికెట్లు తీసిన చెన్నై స్పిన్నర్‌ నూర్‌ అహ్మద్‌ ‘ప్లేయర్‌ ఆఫ్‌ ద మ్యాచ్‌’గా నిలిచాడు.

    దెబ్బతీసిన నూర్‌: ఛేదనలో కేకేఆర్‌ బ్యాటర్లు తడబడ్డారు. పేసర్లు ఖలీల్‌, అన్షుల్‌ ఆరంభంలో ఇబ్బందిపెట్టగా.. మధ్య ఓవర్లలో నూర్‌ కీలక వికెట్లతో కుదురుకోనీయలేదు. ఓపెనర్‌గా బరిలోకి దిగిన నరైన్‌ (24) ఉన్న కాసేపు బ్యాట్‌ ఝుళిపించాడు. మరో ఓపెనర్‌ ఆలెన్‌ (1) నిరాశపర్చాడు. కెప్టెన్‌ రహానె, రఘువంశీ మాత్రం మూడో వికెట్‌కు 50 రన్స్‌ జోడించారు. రహానె, గ్రీన్‌ (0)లను వరుస బంతుల్లో నూర్‌ అవుట్‌ చేయడం మరింతగా దెబ్బతీసింది. రింకూ (6)ను కూడా నూర్‌ పెవిలియన్‌కు చేర్చడంతో కేకేఆర్‌ 90/6 స్కోరుతో ఇబ్బందుల్లో పడింది. అటు సాధించాల్సిన రన్‌రేట్‌ భారీగా పెరగడంతో చివర్లో పోవెల్‌, రమణ్‌దీప్‌ పోరాటం సరిపోలేదు.

     

    ధాటిగా ఆరంభమై..: టాస్‌ ఓడి బ్యాటింగ్‌కు దిగిన చెన్నై ఇన్నింగ్స్‌ వేగంగా ఆరంభమైంది. మొదటి మూడు బంతులనే ఓపెనర్‌ శాంసన్‌ ఫోర్లుగా మలిచి స్టేడియంలో జోష్‌ నింపాడు. మరో ఓపెనర్‌, కెప్టెన్‌ రుతురాజ్‌ (7) మాత్రం వరుసగా ఐదో మ్యాచ్‌లోనూ విఫలమయ్యాడు. అయితే ఆయుష్‌ మాత్రే వచ్చీ రాగానే బ్యాట్‌ ఝుళిపించాడు. క్రీజులో ఉన్నంతసేపు బౌండరీలపైనే దృష్టి సారించాడు. నాలుగో ఓవర్‌లో మాత్రే 4,4,6,6తో 21 రన్స్‌ రాబట్టాడు. ఇక ఆరో ఓవర్‌లోనూ హ్యాట్రిక్‌ ఫోర్లతో జోరు చూపించినా.. అదే ఓవర్‌ ఆఖరి బంతికి మాత్రేను వైభవ్‌ అవుట్‌ చేశాడు. దీంతో రెండో వికెట్‌కు 47 పరుగుల భాగస్వామ్యం ముగిసినా.. పవర్‌ప్లేలో చెన్నై 72/2తో పటిష్టంగా కనిపించింది. కానీ స్పిన్నర్లు నరైర్‌, వరుణ్‌ రాకతో మధ్య ఓవర్లలో జట్టు స్కోరు నెమ్మదించింది. పేసర్‌ కార్తీక్‌ త్యాగి సైతం పదునైన బంతులతో కట్టడి చేశాడు. 12వ ఓవర్‌లో శాంసన్‌ను కార్తీక్‌ బౌల్డ్‌ చేశాడు. ఈ దశలో బ్రెవిస్‌కు సర్ఫరాజ్‌ (23) జత కలవడంతో స్కోరులో కదలిక వచ్చింది. 14వ ఓవర్‌లో సర్ఫరాజ్‌ 6, బ్రెవిస్‌ 4,4తో 15 రన్స్‌ రాబట్టగా.. 16వ ఓవర్‌లో బ్రెవిస్‌ 6,4, సర్ఫరాజ్‌ 4తో 20 రన్స్‌ సమకూరాయి. దీంతో స్కోరు కూడా 150 దాటింది. కానీ డెత్‌ ఓవర్లలో పుంజుకొన్న కేకేఆర్‌ బౌలర్లు వరుస ఓవర్లలో సర్ఫరాజ్‌, బ్రెవిస్‌ను పెవిలియన్‌కు చేర్చడంతో నాలుగో వికెట్‌కు 51 పరుగుల భాగస్వామ్యం ముగిసింది. ఇక, శివమ్‌ దూబే (13 నాటౌట్‌) క్రీజులో ఉన్నా చివరి మూడు ఓవర్లలో చెన్నై 23 పరుగులే చేసింది. దీంతో ఈ జట్టు స్కోరు 200లోపే ముగిసింది.

     

    You Might Also Like

    Comments

    Leave A Comment

    Don’t worry ! Your email address will not be published. Required fields are marked (*).

    Featured News

    Advertisement