వెండి కిలో 3,00,000
న్యూఢిల్లీ: కొత్త ఏడాదిలో బులియన్ మార్కెట్ రేసు గుర్రంలా పరిగెడుతోంది. హైదరాబాద్ మార్కెట్లో కిలో వెండి తొలిసారిగా రూ.3 లక్షలు నమోదు చేసింది. మంగళవారంనాటి ధర రూ.2.92 లక్షలతో పోల్చితే రూ.8,000 పెరిగింది. విశాఖలో కూడా ధర అదే స్థాయిలో పెరిగి రూ.3.07 లక్షలు పలికింది. ఇక ఢిల్లీ స్పాట్ మార్కెట్‌లో అయితే బుధవారం ఒక్క రోజే ధర రూ.15,000 పెరిగి (5.5ు) రూ.2.86 లక్షల రికార్డు స్థాయికి చేరింది. పది గ్రాములు మేలిమి (24 కేరట్స్) బంగారం ధర సైతం రూ.1,500 పెరిగి రూ.1,46,500కు చేరి మరో ఆల్‌టైమ్ రికార్డు నమోదు చేసింది. గత నాలుగు సెషన్స్‌లోనే ఢిల్లీ మార్కెట్లో కిలో వెండి ధర రూ.42,500 (17.45ు), 10 గ్రాముల మేలిమి పసిడి ధర రూ.6,000 (4.3ు) పెరిగాయి. ఈ ఏడాది ప్రారంభం నుంచి చూస్తే 14 రోజుల్లో కిలో వెండి ధర 20ు (రూ.47,000), 10 గ్రాముల బంగారం ధర 6.4ు (రూ.8,800) పెరిగాయి. అంతర్జాతీయ ఉద్రిక్తతలు పెరగడంతో పాటు కల్లోలిత వాతావరణంలో సురక్షిత పెట్టుబడి సాధనంగా వెండి, బంగారాలకు గల ప్రసిద్ధి ఇన్వెస్టర్లను కొనుగోళ్ల దిశగా పరుగులు తీయించింది. దీనికి తోడు ప్రధాన కరెన్సీలతో డాలర్ బలహీనత, కేంద్ర బ్యాంకుల కొనుగోళ్లు, పారిశ్రామిక వినియోగంలో వృద్ధి ఈ బుల్‌రన్‌కు కారణమని విశ్లేషకులంటున్నారు.
అంతర్జాతీయ మార్కెట్: అంతర్జాతీయ స్పాట్ మార్కెట్‌లోనూ బంగారం, వెండి ధరలు సెగలు కక్కుతున్నాయి. బుధవారం ఒక దశలో ఔన్స్ (31.10 గ్రాములు) మేలిమి బంగారం 4,640.13 డాలర్లకు చేరి కొత్త రికార్డు నమోదు చేసింది. ఔన్స్ వెండి ధర 91.86 డాలర్లకు చేరి సరికొత్త రికార్డు నమోదు చేసింది.










Comments