• Jul 28, 2026
  • NPN Log

    హైదరాబాద్‌ : ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డివి ‘డైవర్షన్‌ పాలిటిక్స్‌’ అని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు ఎన్‌.రాంచందర్‌రావు విమర్శించారు. నిరుద్యోగ భృతి, ఫీజు రీయింబర్స్‌మెంటు వంటి అంశాల నుంచి యువత దృష్టి మళ్లించేందుకే ఆయన.. ఎన్నికల్లో పోటీ చేసే కనీస వయస్సును 25 నుంచి 21 ఏళ్లకు తగ్గించాలన్న ప్రతిపాదనను తెరపైకి తెచ్చారని ఆరోపించారు. శాసనసభ్యుడికి అనుభవం అవసరమనే దూరదృష్టితోనే అంబేడ్కర్.. కనీస వయస్సును 25 ఏళ్లుగా నిర్ణయించారని అన్నారు. సోమవారం ఆయన మీడియాతో మాట్లాడారు.

     

    యువతకు అవకాశాలు ఇవ్వాలనే చిత్తశుద్ధి ఉంటే, ముందుగా కాంగ్రెస్‌ జాతీయ అధ్యక్ష పదవి నుంచి మల్లికార్జున్‌ ఖర్గేను తప్పించి, ఆ బాధ్యతలను యువ నాయకుడికి అప్పగించాలని సవాల్‌ విసిరారు. కాంగ్రెస్‌ అధికారంలోకి వచ్చి రెండున్నరేళ్లు గడిచినా విద్యార్థులు, యువతకు ఇచ్చిన ఒక్క హామీని కూడా నెరవేర్చలేదని విమర్శించారు. ‘రాష్ట్రంలో సుమారు 20 లక్షల మంది విద్యార్థులకు రూ.12 వేల కోట్ల ఫీజు రీయింబర్స్‌మెంటు చెల్లించాల్సి ఉంది. ఓయూకు వెయ్యి కోట్లు మంజూరు చేస్తామని ప్రకటించిన సీఎం, ఇప్పటి వరకు రూపాయి కూడా విడుదల చేయలేదు. యువతకు ఏటా 2 లక్షల ప్రభుత్వ ఉద్యోగాలు, నెలకు రూ.4,000 నిరుద్యోగ భృతి, విద్యాభరోసా కార్డులు, విద్యార్థినులకు ఉచితంగా స్కూటీలు ఇస్తామని ఇచ్చిన హామీని అమలు చేయలేదు’ అని రాంచందర్‌రావు ఆరోపించారు. విద్యాశాఖలో పూర్తిగా విఫలమైన సీఎం రేవంత్‌ రెడ్డి విద్యాశాఖ మంత్రిగా నైతిక బాధ్యత వహించి తక్షణమే రాజీనామా చేయాలని డిమాండ్‌ చేశారు.

     

    నిజంగా చిత్తశుద్ధి ఉంటే విద్యాశాఖ బాధ్యతలను కాంగ్రెస్‌ యువ ఎమ్మెల్యే యశస్వినీ రెడ్డికి అప్పగించాలని సూచించారు. కాగా, ప్రొఫెసర్‌ మల్లికార్జున్‌, సుజాత సంయుక్తంగా రచించిన ‘శ్రీమన్‌ భగవద్గీత’ పుస్తకాన్ని రాంచందర్‌ రావు ఆవిష్కరించారు. ఈ పుస్తకం కార్పొరేట్‌ రంగంలోని ఉద్యోగులు, యువతకు ఎంతగానో ఉపయోగపడుతుందని ఆయన పేర్కొన్నారు. హైడ్రా కమిషనర్‌ రంగనాథ్‌ను తప్పించాలంటూ హైకోర్టు ఇచ్చిన ఆదేశాలు రేవంత్‌ సర్కార్‌కు చెంపపెట్టులాంటిదని రాంచందర్‌రావు పేర్కొన్నారు. పేదలను హైడ్రా పెట్టిన బాధలకు సీఎం రేవంత్‌ రెడ్డి మూల్యం చెల్లించుకోక తప్పదని మల్కాజ్‌గిరి ఎంపీ ఈటల రాజేందర్‌ స్పష్టం చేశారు. హిట్లర్‌కు పట్టిన గతే సీఎం రేవంత్‌ సర్కార్‌కు పడుతుందని పేదలు శాపనార్థాలు పెడుతున్నారని పేర్కొన్నారు.

     

    30న అమెరికా పర్యటనకు రాంచందర్‌రావు

    రాంచందర్‌రావు ఈనెల 30న అమెరికా పర్యటనకు వెళ్లనున్నారు. ఆటా ఉత్సవాలకు ఆయన హాజరవుతారు. వచ్చేనెల 6న తిరిగి ఇక్కడకు చేరుకుంటారని పార్టీవర్గాలు తెలిపాయు. కాగా, రాంచందర్‌రావు మంగళవారం ఢిల్లీ వెళ్లనున్నారు. పార్టీ అగ్రనేతలతో ఆయన సమావేశమయ్యే అవకాశం ఉంది.

    You Might Also Like

    Comments

    Leave A Comment

    Don’t worry ! Your email address will not be published. Required fields are marked (*).