సన్ రైజర్స్- ఢిల్లీ మ్యాచ్‌కు వాన గండం.. వెదర్ రిపోర్ట్ ఇదే!
ఐపీఎల్ 2026లో భాగంగా ఇవాళ (మంగళవారం) మరో కీలక పోరు జరగనుంది. హైదరాబాద్‌లోని ఉప్పల్ స్టేడియం వేదికగా సన్ రైజర్స్ హైదరాబాద్, ఢిల్లీ క్యాపిటల్స్ జట్లు తలపడనున్నాయి. ఇరు జట్లూ ఆరు పాయింట్లతో సమంగా ఉన్నా.. రన్‌రేట్‌లో సన్ రైజర్స్‌ది పైచేయిగా ఉంది. ఉప్పల్ పిచ్ విషయానికి వస్తే.. ఇది బ్యాటింగ్‌కు అనుకూలంగా ఉంటుంది. దీంతో ఇవాళ జరిగే ఈ పోరులో హై స్కోరింగ్ థ్రిల్లర్‌గా మారే అవకాశాలు ఉన్నాయి. అయితే ఇక్కడ పేసర్లు కూడా అధికంగా ప్రభావం చూపుతున్నారు. ఈ పిచ్‌పై ఎక్కువ వికెట్లు వీరే తీశారు.
ఈ పిచ్‌పై ప్రారంభ ఓవర్లలో స్వల్ప స్వింగ్ ఉండే అవకాశం ఉంది. కాబట్టి కొత్త బంతితో బౌలర్లు కచ్చితమైన లెంగ్త్‌లో బౌలింగ్ చేస్తే వికెట్లు తీసే ఛాన్స్ ఉందని క్రీడా విశ్లేషకులు అభిప్రాయ పడుతున్నారు. మ్యాచ్ ఆరంభంలో ఒత్తిడిని ఎదుర్కొని బ్యాటర్లు నిలదొక్కుంటే మాత్రం భారీ స్కోర్లు సాధించే అవకాశం ఉంది. ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచిన జట్టు ఛేజింగ్ చేయడానికి మొగ్గు చూపే అవకాశం ఉంది. ఈ మ్యాచ్‌కు వాతావరణం అనుకూలంగా కనిపిస్తోంది. మ్యాచ్ ప్రారంభమయ్యే సమయానికి వర్షం పడే అవకాశాలు చాలా తక్కువగా ఉంటాయని వాతావరణ శాఖ తెలిపింది.
మధ్యాహ్నం నుంచి సాయంత్రం వరకు ఉరుములతో కూడిన వర్షం పడే ఛాన్స్ ఉంది. రాత్రి 7 గంటల నుంచి వాతావరణం బాగా ఉంటుంది. మ్యాచ్ జరిగే సమయంలో ఉష్ణోగ్రత 29 డిగ్రీల సెల్సియస్‌గా ఉండవచ్చని, వాతావరణం మేఘావృతమై ఉంటుందని అధికారులు తెలిపారు. మొత్తంగా మ్యాచ్ సమయంలో వర్షం వచ్చే అవకాశం కేవలం 2 శాతంగా మాత్రమే ఉంది. గత రెండు రోజులుగా హైదరాబాద్ లో వర్షం కురుస్తోంది. ఈ క్రమంలో ఇవాళ మ్యాచ్‌కి వాన ముప్పు ఉందేమో అని క్రికెట్ ఫ్యాన్స్ ఆందోళన వ్యక్తం చేశారు.









Comments