అనిల్ అంబానీ ముంబై ఫ్లాట్ జప్తు
న్యూఢిల్లీ : ప్రముఖ పారిశ్రామికవేత్త అనిల్ అంబానీకి చెందిన ముంబై ఫ్లాట్‌ని అలాగే ఆయన కుమారుడు జై అంశుల్ అంబానీ ఖండాలా ఫామ్ హౌస్‌ని అటాచ్ చేసినట్లు ఈడీ మంగళవారం ప్రకటించింది. రూ.3,034 కోట్ల విలువైన వీటిని రిలయన్స్ కమ్యూనికేషన్స్‌కి సంబంధించిన మనీలాండరింగ్ కేసులో అటాచ్ చేసినట్లు పేర్కొంది. బ్యాంకులను మోసం చేసిన విషయంలో ఈ మనీలాండరింగ్ కేసు నమోదైంది. బ్యాంకులు, ప్రజలు నష్టపోకుండా ఈ చర్య తీసుకున్నట్లు ఈడీ ప్రకటనలో పేర్కొంది. స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, పంజాబ్ నేషనల్ బ్యాంకు, బ్యాంక్ ఆఫ్ బరోడా, ఎల్‌ఐసీల ఫిర్యాదుల మేరకు సీబీఐ ఆర్‌కామ్, అనిల్ అంబానీ తదితరుల మీద పలు కేసులు నమోదు చేసింది. వీటి ఆధారంగా మనీలాండరింగ్ కేసు నమోదు అయ్యింది. ఆర్‌కామ్, దాని అనుబంధ గ్రూప్ కంపెనీలు స్వదేశీ, విదేశీ సంస్థల నుంచి భారీగా అప్పులు చేశాయి. ఆ మొత్తం రూ.40,185 కోట్లకు చేరిందని ఈడీ పేర్కొంది.








Comments