• Apr 30, 2026
  • NPN Log

    హైదరాబాద్‌ : తెలంగాణ కొత్త డీజీపీగా సీవీ ఆనంద్‌ నియామకానికి లైన్‌ క్లియర్‌ చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం శుక్రవారం కీలక ఉత్తర్వులు జారీ చేసింది. ప్రస్తుతం హోం శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శిగా కొనసాగుతున్న సీవీ ఆనంద్‌ స్థానంలో డీజీపీ స్థాయి అధికారిణి శిఖా గోయల్‌ను నియమించింది. ఆమె నియామకం మే ఒకటో తేదీ నుంచి అమల్లోకి వస్తుందని పేర్కొంది. ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రామకృష్ణారావు జీవో నంబర్‌ 535 జారీ చేశారు. నిజానికి, ప్రస్తుత డీజీపీ శివధర్‌ రెడ్డి ఈనెల 30న పదవీ విరమణ చేయనున్నారు. దాంతో, సీవీ ఆనంద్‌ స్థానంలో శిఖా గోయల్‌ను నియమించడం; ఆమె నియామకం కూడా మే ఒకటో తేదీ నుంచి అమల్లోకి వస్తుందని పేర్కొనడం; ఆనంద్‌కు ఎక్కడా పోస్టింగ్‌ ఇవ్వకపోవడంతో తదుపరి డీజీపీ ఆయనేనని స్పష్టం చేసినట్లు అయిందని చెబుతున్నారు. నూతన డీజీపీగా సీవీ ఆనంద్‌ను నియమించనున్నారన్న విషయాన్ని తొలుత ‘ఆంధ్రజ్యోతి’ ప్రచురించిన సంగతి తెలిసిందే. ఇక, ప్రస్తుతం విజిలెన్స్‌ విభాగం డైరెక్టర్‌ జనరల్‌గా ఉన్న శిఖా గోయల్‌ను హోం శాఖ ప్రధాన కార్యదర్శిగా నియమిస్తూనే.. సైబర్‌ సెక్యూరిటీ బ్యూరో, ఫోరెన్సిక్‌ సైన్స్‌ ల్యాబరేటరీల అదనపు బాధ్యతలు అప్పగించారు. మల్టీజోన్‌-2 అదనపు డీజీగా ఉన్న దేవేంద్రసింగ్‌ చౌహాన్‌ను విజిలెన్స్‌ విభాగం డీజీగా నియమించారు.

    ప్రస్తుతం మల్కాజిగిరి కమిషనర్‌గా ఉన్న అవినాష్‌ మహంతిని డ్రగ్స్‌ కంట్రోల్‌ విభాగం డీజీగా నియమిస్తూ.. అక్కడున్న షానవాజ్‌ ఖాసింను మల్టీజోన్‌ 2 ఐజీపీగా బదిలీ చేశారు. అవినాష్‌ మహంతికి ఏసీబీ డైరెక్టర్‌గా అదనపు బాధ్యతలు అప్పగించారు. ఏసీబీలో డైరెక్టర్‌గా పని చేస్తున్న తరుణ్‌ జోషిని ఫ్యూచర్‌ సిటీ కమిషనర్‌గా నియమించారు. ప్రస్తుతం ఫ్యూచర్‌ సిటీ కమిషనర్‌గా ఉన్న సుధీర్‌బాబు ఈనెల 30న రిటైర్‌ అవుతున్నారు. స్పెషల్‌ ఇంటెలిజెన్స్‌ బ్యూరో (ఎస్‌ఐబీ) చీఫ్‌గా ఉన్న బి.సుమతిని మల్కాజిగిరి కమిషనర్‌గా నియమించారు. ఇంటెలిజెన్స్‌ ఐజీగా ఉన్న కార్తికేయను ఎస్‌ఐబీ చీఫ్‌గా నియమించారు.

     

    You Might Also Like

    Comments

    Leave A Comment

    Don’t worry ! Your email address will not be published. Required fields are marked (*).