అమెరికాతో మళ్లీ వాణిజ్య చర్చలు.. వాషింగ్టన్కు భారత బృందం..
అమెరికాతో ద్వైపాక్షిక వాణిజ్య ఒప్పందం కుదుర్చుకునే దిశగా భారత్ మరో కీలక అడుగు వేయబోతోంది. ఈ నెలలో భారత ప్రతినిధి బృందం వాషింగ్టన్కు వెళ్లి చర్చలు జరపనుంది. అమెరికాలో మారుతున్న టారిఫ్ విధానాలు, అంతర్జాతీయంగా సరఫరా గొలుసుల్లో వచ్చిన అంతరాయాల నేపథ్యంలో జరగబోయే ఈ చర్చలు ప్రాధాన్యం సంతరించుకున్నాయి. ఏప్రిల్ 20న వాషింగ్టన్కు ఒక వాణిజ్య ప్రతినిధి బృందాన్ని భారత్ పంపనుంది. ఈ ప్రతినిధి బృందానికి ప్రధాన సంధాన కర్త దర్పణ్ జైన్ నేతృత్వం వహించనున్నారు.
'ప్రధాన సంధానకర్త నేతృత్వంలోని భారత బృందం ఈ నెల 20వ తేదీ నుంచి అమెరికాలో పర్యటించనుంది. సుమారు 3-4 నెలల విరామం తర్వాత సంప్రదింపుల బృందాలు ప్రత్యక్షంగా సమావేశం కానున్నాయి. ఈ మధ్యకాలంలో వారు వర్చువల్‌గా సంప్రదింపులు జరుపుతూ వచ్చారు' అని వాణిజ్య కార్యదర్శి రాజేష్ అగర్వాల్ తెలిపారు. ఫిబ్రవరి 7న విడుదల చేసిన ఉమ్మడి ప్రకటనకు కొనసాగింపుగా, చట్టపరమైన ఒప్పందాన్ని ఖరారు చేసే దిశగా ఇది మరో అడుగని ఆయన పేర్కొన్నారు.
ఆ ప్రకటనను చట్టపరమైన ఒప్పందంగా ఖరారు చేయడానికి మరిన్ని చర్చలు, తదుపరి సంప్రదింపులు అవసరమని రాజేష్ అగర్వాల్ పేర్కొన్నారు. ఈ ఒప్పందం కుదిరితే రెండు దేశాల మధ్య వాణిజ్యం మరింత పెరుగుతుంది. టెక్నాలజీ, ఎనర్జీ, వ్యవసాయ రంగాల్లో సహకారం పెరుగుతుంది. గ్లోబల్ సరఫరా గొలుసుల్లో భారత్‌కు బలం చేకూరుతుంది. అమెరికాతో ట్రేడ్ డీల్‌ను వేగవంతం చేయడానికి భారత్ చేస్తున్న ఈ తాజా ప్రయత్నం ద్వైపాక్షిక సంబంధాలను మరింత బలపరిచే అవకాశముంది.









Comments