• May 01, 2026
  • NPN Log

    లక్నో : ఆన్‌లైన్‌లో వేధింపులు భరించలేక ఓ మహిళ ఆత్మహత్య చేసుకుంది. వివాహ వార్షికోత్సవానికి ఒక రోజు ముందు ప్రాణాలు తీసుకుంది. ఈ సంఘటన ఉత్తర్‌ప్రదేశ్‌లో ఆలస్యంగా వెలుగు చూసింది. పోలీసులు తెలిపిన వివరాల మేరకు.. బిజ్నోర్‌కు చెందిన ఓ మహిళ మూడు రోజుల క్రితం ఇంట్లో ఆత్మహత్య చేసుకుని చనిపోయింది. ఆమె ఎందుకు ఆత్మహత్య చేసుకుందో కుటుంబసభ్యులకు అర్థంకాలేదు. అంత్యక్రియలు పూర్తయిన రెండు రోజుల తర్వాత మహిళ భర్తకు ఇంట్లో సూసైడ్ నోట్ దొరికింది. ఆ నోట్‌లో మహిళ తాను ఆత్మహత్య చేసుకోవడానికి గల కారణాలు రాసుకొచ్చింది.

    ఆ సూసైడ్ నోట్‌లో.. ‘ఆ వ్యక్తి నన్ను చాలా దారుణంగా టార్చర్ చేశాడు. వచ్చే జన్మలో కూడా నేను ఇలాంటి కుటుంబంలోనే పుట్టాలని కోరుకుంటున్నా. నా పిల్లలను బాగా చూసుకోండి. క్షమించండి.. మీ అమ్మ చనిపోవాల్సిందే(పిల్లలను ఉద్దేశిస్తూ)’ అని రాసి ఉంది. భర్త.. భార్య ఫోన్ చెక్ చేయగా మూడు అనుమానాస్పద కాల్స్ వెలుగు చూశాయి. అతడు మూడు నంబర్లకు ఫోన్ చేశాడు. అందులో ఇద్దరు వ్యక్తులు ఫోన్ లిఫ్ట్ చేయలేదు. ఓ వ్యక్తికి సాధారణ కాల్ చేయగా అతడు స్పందించలేదు. కొద్దిసేపటి తర్వాత అతనే తిరిగి వీడియో కాల్ చేశాడు. మృతురాలి కుటుంబసభ్యులను బెదిరించాడు.

    మహిళ భర్త ఏప్రిల్ 30వ తేదీన పోలీసులను ఆశ్రయించాడు. భార్య మరణంపై ఫిర్యాదు చేశాడు. మహిళ చనిపోయిన రెండు రోజుల తర్వాత దర్యాప్తు ప్రారంభం అయింది. డిజిటల్ అరెస్ట్ వేధింపుల కారణంగానే మహిళ ఆత్మహత్య చేసుకున్నట్లు పోలీసుల ప్రాథమిక దర్యాప్తులో తేలింది. అనుమానాస్పద ఫోన్ నంబర్ల ఆధారంగా కేసు దర్యాప్తు చేస్తున్నారు.

    You Might Also Like

    Comments

    Leave A Comment

    Don’t worry ! Your email address will not be published. Required fields are marked (*).

    Featured News

    Advertisement