ఇండిగో రూ.10వేల ఓచర్ ఆఫర్.. ఎప్పటి నుంచంటే.?
దేశీయ విమానయాన సంస్థ ఇండిగో లో సంక్షోభ పరిస్థితుల నేపథ్యంలో ఇటీవల ప్రయాణికులకు రూ.10వేల వరకూ ట్రావెల్ ఓచర్ కల్పిస్తామని ప్రకటించిన సంగతి తెలిసిందే. ఆ ఆఫర్‌ను చెల్లించేందుకు సిద్ధమైంది ఆ సంస్థ . అయితే.. ఈ ఆఫర్ ఎవరెవరికి వర్తిస్తుంది. ఎలా పొందాలనే పూర్తి వివరాలు మీకోసం...
డిసెంబర్ 3, 4, 5 తేదీలలో తీవ్రంగా ప్రభావితమై విమానాశ్రయాలలో ఇరుక్కుపోయిన ప్రయాణికులకు ఉపశమనం కల్పిస్తూ.. ఈ నెల 26 నుంచి రూ.10వేల ట్రావెల్ ఓచర్‌ను జారీ చేయనున్నట్టు ఇండిగో ప్రకటించినట్టు తెలుస్తోంది. విమానయాన సంస్థ నిబంధనలకు అనుగుణంగా ఉన్న ఒక్కో టికెట్‌కు రూ.5 వేల నుంచి రూ.10 వేల వరకు పరిహారంగా చెల్లిస్తామని ఆ కంపెనీ గతంలోనే తెలిపింది. అయితే.. ఈ చెల్లింపులు ఆలస్యం కాకుండా అర్హత ఉన్న ప్రయాణికులందరికీ చేరేలా చూడాలాని ఇటీవల జరిగిన ఓ సమావేశంలో విమానయాన అధికారులు ఇండిగోకు సూచించినట్టు సమాచారం.
ఇండిగో వెబ్‌సైట్ ద్వారా నేరుగా టికెట్ బుక్ చేసుకున్న ప్రయాణికుల డేటా విమానయాన సంస్థ వద్ద ఉన్నందున... వారందరికీ చెల్లింపులు ప్రారంభించాలని సమావేశంలో నిర్ణయించారు. మిగిలిన ప్రయాణికుల వివరాలను.. ట్రావెల్ ఏజెంట్లు, ఇతర ఆన్‌లైన్ ఏజెన్సీల నుంచి సేకరించి.. ప్రభావిత కస్టమర్లకు ఈ ఆఫర్ వర్తించేలా చేయనున్నారు. వీటి పర్యవేక్షణ బాధ్యతలను డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్(DGCA)కు అప్పగించగా.. వాటి ఫిర్యాదుల ఆధారంగా పౌర విమానయాన మంత్రిత్వ శాఖ ఈ ప్రక్రియను పర్యవేక్షించనుంది.
ఇదిలా ఉండగా.. ఇండిగో విమానాలు రద్దయిన తర్వాత టికెట్ బుక్ చేసుకున్న ప్రయాణికుల్లో చాలా మందికి ఆయా ట్రావెల్ ఏజెన్సీల ద్వారా రీఫండ్ ప్రక్రియ ఇంకా పూర్తవలేదని సమాచారం. ఇది విమానయాన సంస్థలు, బుకింగ్ ప్లాట్‌ఫామ్‌ల మధ్య సమన్వయ లోపాన్ని సూచిస్తున్నట్టు తెలుస్తోంది. అయితే.. డీజీసీఏ ఆదేశానుసారం ఇండిగో చెల్లింపులకు ముందే MakeMyTrip ద్వారా సుమారు రూ.10 కోట్ల మేర రీఫండ్ అయినట్టు విశ్వసనీయ వర్గాలు వెల్లడించాయి.









Comments