• Dec 22, 2025
  • NPN Log

    సాధారణంగా టీ20 క్రికెట్ అంటేనే ఫోర్లు, సిక్సర్ల వర్షం. భారీ స్కోర్లు, మెరుపు ఇన్నింగ్స్‌ల కోసమే అభిమానులు స్టేడియాలకు క్యూ కడుతుంటారు. కానీ, కొన్నిసార్లు ఈ ఫార్మాట్ బ్యాటర్లకు నరకం చూపిస్తుంది. బౌలర్లు నిప్పులు చెరిగే బంతులతో విరుచుకుపడితే, రెండు జట్లు కలిపి చేసే స్కోరు కనీసం ఒక ఐపీఎల్ ఓవర్‌లో వచ్చే పరుగుల కంటే తక్కువగా ఉండటం ఆశ్చర్యం కలిగిస్తుంది. అంతర్జాతీయ టీ20 చరిత్రలో అత్యల్ప స్కోర్లు నమోదైన ఐదు మ్యాచ్‌ల వివరాలు ఇప్పుడు చూద్దాం.

    మంగోలియా వర్సెస్ సింగపూర్

    అంతర్జాతీయ టీ20 చరిత్రలో అత్యల్ప అగ్రిగేట్ స్కోరు నమోదైన మ్యాచ్‌గా సెప్టెంబర్ 5, 2024న జరిగిన మంగోలియా – సింగపూర్ మ్యాచ్ నిలిచింది. మలేషియాలోని బాంగీ వేదికగా జరిగిన ఈ మ్యాచ్‌లో రెండు జట్లు కలిపి చేసిన స్కోరు అక్షరాలా 23 పరుగులు మాత్రమే. ఈ మ్యాచ్ కేవలం 10.5 ఓవర్లలోనే ముగిసిపోవడం గమనార్హం. మొత్తం 11 వికెట్లు పడగా.. రన్ రేట్ కేవలం 2.12గా నమోదైంది. బ్యాటర్లు క్రీజులోకి రావడం, పెవిలియన్‌కు వెళ్లడం తప్ప పరుగుల ఖాతా తెరవడానికి కూడా ఇబ్బంది పడ్డారు.

     

    స్పెయిన్ వర్సెస్ ఐల్ ఆఫ్ మ్యాన్

    ఈ జాబితాలో రెండో స్థానంలో నిలిచిన మ్యాచ్ స్పెయిన్, ఐల్ ఆఫ్ మ్యాన్ మధ్య ఫిబ్రవరి 26, 2023న జరిగింది. కార్టాజినాలో జరిగిన ఈ పోరులో కూడా రెండు జట్లు కలిపి కేవలం 23 పరుగులు మాత్రమే చేశాయి. అయితే మంగోలియా మ్యాచ్‌తో పోలిస్తే ఈ మ్యాచ్ కేవలం 9 ఓవర్లలోనే ముగిసింది. ఇందులో మొత్తం 10 వికెట్లు కూలగా.. రన్ రేట్ 2.55గా ఉంది. బౌలర్లు కచ్చితమైన లెంగ్త్‌తో దాడి చేయడంతో బ్యాటర్లు చేతులెత్తేశారు.

    ఇండోనేషియా వర్సెస్ తైమూర్-లెస్టే

    నవంబర్ 11, 2025న బాలీ వేదికగా జరిగిన ఈ మ్యాచ్‌లో కూడా పరుగుల కంటే వికెట్లే ఎక్కువగా కనిపించాయి. ఇండోనేషియా, తైమూర్-లెస్టే జట్లు కలిపి స్కోరు బోర్డుపై కేవలం 34 పరుగులు మాత్రమే చేర్చగలిగాయి. ఈ మ్యాచ్ 11.2 ఓవర్ల పాటు సాగగా.. మొత్తం 9 వికెట్లు పడ్డాయి. రన్ రేట్ కేవలం 3గా నమోదైంది. పసికూనల మధ్య జరిగిన ఈ పోరులో బ్యాటర్ల వైఫల్యం కొట్టొచ్చినట్లు కనిపించింది.

    హాంగ్‌కాంగ్ వర్సెస్ మంగోలియా 

    ఆగస్టు 31, 2024న కౌలాలంపూర్‌లో హాంగ్‌కాంగ్, మంగోలియా తలపడ్డాయి. ఈ మ్యాచ్‌లో రెండు జట్లు కలిపి చేసిన మొత్తం స్కోరు 35 పరుగులు. ఈ స్వల్ప స్కోరు కోసం మ్యాచ్ ఏకంగా 16 ఓవర్ల పాటు సాగడం విశేషం. బౌలర్లు పిచ్‌ను అనుకూలంగా మార్చుకుని 11 వికెట్లు తీశారు. మంగోలియా జట్టు తన బ్యాటింగ్ వైఫల్యాన్ని మరోసారి చాటుకుంది.

    టాంజానియా వర్సెస్ మాలి

    సెప్టెంబర్ 21, 2024న దార్-ఎస్-సలామ్ వేదికగా జరిగిన టాంజానియా – మాలి మ్యాచ్ ఈ జాబితాలో ఐదో స్థానంలో ఉంది. ఈ మ్యాచ్‌లో రెండు జట్లు కలిపి కేవలం 37 పరుగులు మాత్రమే చేశాయి. 13.4 ఓవర్ల పాటు సాగిన ఈ మ్యాచ్‌లో 10 వికెట్లు పడ్డాయి. రన్ రేట్ 2.7గా ఉండటం గమనార్హం. టీ20 క్రికెట్‌లో ఇలాంటి తక్కువ స్కోర్లు నమోదు కావడం ఆ ఫార్మాట్ లోని అనిశ్చితికి నిదర్శనం.

    You Might Also Like

    Comments

    Leave A Comment

    Don’t worry ! Your email address will not be published. Required fields are marked (*).

    Featured News

    Advertisement