• Sep 20, 2026
  • NPN Log

    అమరావతి : పశు సంవర్ధక శాఖలో వెటర్నరీ అసిస్టెంట్‌ సర్జన్‌ (వీఏఎస్‌) పోస్టుల భర్తీ విషయంలో ప్రభుత్వం మరోసారి నిర్ణయాన్ని మార్చుకుంది. మొదట ఏపీపీఎస్సీ ద్వారానే నియామకాలు చేపట్టాలని నిర్ణయించింది. జాబ్‌ క్యాలెండర్‌-2026లో రెండో దశలో ఉన్న వీఏఎస్‌ పోస్టుల భర్తీని ఏపీపీఎస్సీకి అప్పగిస్తున్నట్లు ఈ నెల 13న జీవో 21 జారీ చేసింది. అయితే మరుసటి రోజు ఈ నిర్ణయాన్ని ఉపసంహరించుకుంది. పశు సంవర్ధక శాఖలో గతంలో ఉన్నవిధంగా.. మెరిట్‌ ఆధారిత ఎంపిక, వెయిటేజీ, చట్టంలోని ప్రత్యేక నిబంధనలను పరిగణలోకి తీసుకుని, డిపార్ట్‌మెంటల్‌ సెలక్షన్‌ కమిటీ ద్వారానే వీఏఎస్‌ పోస్టులు భర్తీ చేస్తామంటూ జీవో 21ని ఉపసంహరించుకుని, జీవో 22 జారీచేసింది. అయితే ఈ విషయాన్ని క్షుణ్ణం గా పరిశీలించిన ప్రభుత్వం.. పారదర్శకత, ఏకరూపకతను కల్పించే ఉద్దేశంతో వీఏఎస్‌ పోస్టులను ఏపీపీఎస్సీ ద్వారానే పరీక్ష నిర్వహించి, నియామకాలు చేపట్టాలని తాజాగా నిర్ణయించింది. ఈ మేరకు గురువారం జీవో 24 జారీ చేసింది. జీవో 21, 22లను రద్దు చేసినట్లు తాజా ఉత్తర్వుల్లో పేర్కొంది. సాధారణ పరిపాలన (సర్వీసెస్‌), ఏపీపీఎస్సీ, పశుసంవర్ధక శాఖ డైరెక్టర్‌ ఈ విషయంలో తదుపరి చర్య తీసుకోవాలని ప్రభుత్వం ఆదేశించింది.

     

    ఎందుకిలా.. జరిగిందంటే?

    పశు సంవర్ధక శాఖలో సుమారు 350కిపైగా పశువైద్యుల పోస్టులు ఖాళీగా ఉన్నాయి. ఇందులో 164 పోస్టులను జాబ్‌ క్యాలెండర్‌లో భర్తీ చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. అయితే 2016లో టీడీపీ ప్రభుత్వం జారీ చేసిన జీవో 52 ప్రకారం వీఏఎస్‌ పోస్టుల భర్తీకి 100 మార్కులతో మెరిట్‌ను నిర్ణయించే విధానం ఉండేది. బీవీఎస్సీకి 60, ఎంవీఎస్సీ అర్హతకు 10, కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ సంస్థల్లో కాంట్రాక్టు సేవలకు 10, డిగ్రీ పూర్తైనప్పటి నుంచి సీనియారిటీకి ఏడాదికి 4 చొప్పున గరిష్ఠంగా 20 మార్కులు కేటాయించే విధానం ఉండేది. ఈ తరహా వెయిటేజీ విధానం వైద్యారోగ్య శాఖ డాక్టర్ల నియామకంలోనూ ఉంది. అయితే పారదర్శకత కోసం వీఏఎస్‌ పోస్టుల భర్తీని ఏపీపీఎస్సీతో చేపట్టాలని తొలుత నిర్ణయం తీసుకున్నారు. కానీ సాధారణ పరిపాలన (సర్వీసెస్‌) ఉత్తర్వులు లేకుండా ఈ ప్రక్రియను చేపట్టే స్థితి లేదని ఏపీపీఎస్సీ ప్రభుత్వానికి తెలిపిందని సమాచారం. దీన్నిబట్టి ముందుగా ఏపీపీఎస్సీని సంప్రదించకుండా జీవో ఇచ్చినట్లు తేలింది. అలాగే గత ఎనిమిదేళ్లుగా వీఏఎస్‌ పోస్టుల భర్తీ జరగనందున ఇప్పుడు పరీక్ష విధానం అమలు చేస్తే.. ఇన్నేళ్లుగా ఎదురుచూస్తున్న బీవీఎస్సీ, ఎంవీఎస్సీ పూర్తిచేసిన నిరుద్యోగులు నష్టపోతారన్న అభిప్రాయంతో శాఖాపరంగా మెరిట్‌, వెయిటేజీ విధానాన్ని అనుసరించాలని రెండో జీవో ఇచ్చారు.

    దీనిపైనా రచ్చ జరగడంతో పారదర్శకంగా నియామకాలు జరగాలంటే.. ఏపీపీఎస్సీ ద్వారా పరీక్ష జరపడమే సరైందని ప్రభుత్వం తాజాగా నిర్ణయం తీసుకుంది. కానీ వైద్య వృత్తిలో సీనియారిటీ, ప్రాక్టికల్స్‌ చాలా ముఖ్యం. పరీక్ష విధానం వల్ల తాజాగా డిగ్రీ పట్టాలు తీసుకున్న అభ్యర్థులకు థియరీ ప్రకారం ఎంపికయ్యే అవకాశం వచ్చినా.. ప్రాక్టికల్‌ అనేది లేకుండా పోతుందని, సీనియర్లకు అవకాశం దక్కదనే అభిప్రాయం మరికొందరిలో ఉంది. ఏదైనా వీఏఎస్‌ పోస్టుల భర్తీ పశువైద్యం, పౌల్ర్టీ రంగాలతోపాటు ప్రైవేట్‌ సంస్థల్లో పని చేసే వారి ఆశలను చిగురింపజేస్తున్నది. వీఏఎస్‌ పోస్టుల భర్తీకి ఇప్పటికే నోటిఫికేషన్‌ ఇవ్వాలనుకున్నా.. పశుసంవర్ధక శాఖ డైరెక్టర్‌ పోస్టు ఖాళీగా ఉండటంతో.. కొద్దిగా ఆలస్యమవుతున్నదని సమాచారం. డైరెక్టర్‌ కూడా సంతకం చేస్తే.. ఏపీపీఎస్సీ నోటిఫికేషన్‌ జారీ చేస్తుందని అంటున్నారు.

    You Might Also Like

    Comments

    Leave A Comment

    Don’t worry ! Your email address will not be published. Required fields are marked (*).

    Featured News

    Advertisement