ఏసియన్ గేమ్స్‌లో భారత్ జోరు.. ఎంఎంఏలో తొలి పతకం..
ఏసియన్ గేమ్స్‌లో భారత్ క్రీడాకారుల జోరు కొనసాగుతోంది. పలు విభాగాల్లో అద్భుత ప్రదర్శనతో పతకాలను సొంతం చేసుకుంటున్నారు. మిక్స్డ్ మార్షల్ ఆర్ట్స్ (ఎంఎంఏ) విభాగంలో భారత క్రీడాకారిణి సుచికా తారియాల్ కొత్త చరిత్ర సృష్టించింది. సోమవారం జరిగిన మహిళల ట్రెడిషనల్ 60కేజీల విభాగంలో సుచికా కాంస్య పతకం సాధించింది. దీంతో ఎంఎంఏ విభాగంలో భారత్‌కు తొలి పతకాన్ని అందించిన క్రీడాకారిణిగా నిలిచింది. సింగపూర్‌కు చెందిన హుయ్హూన్ టియోతో సుచికా సెమీఫైనల్ పోరులో తలపడింది. హోరాహోరీగా సాగిన ఈ పోరు అదనపు సమయంలోకి వెళ్లింది. చివరకు స్వల్ప తేడాతో సుచిక ఓటమి పాలైంది. దాంతో ఫైనల్‌కు చేరే అవకాశం కోల్పోయినా.. అప్పటికే కాంస్య పతకం ఖాయమైంది.
ఆసియా క్రీడలు 2026లో భాగంగా షూటింగ్లో భారత్ మరో పతకాన్ని ఖాతాలో వేసుకుంది. పురుషుల 10 మీటర్ల ఎయిర్ రైఫిల్ టీమ్ ఈవెంట్లో రుద్రాంక్ష్ పాటిల్, హిమాంశు ధిల్లాన్, పార్థ్ మానేలతో కూడిన భారత జట్టు రజత పతకం సాధించింది. సోమవారం జరిగిన పోటీలో భారత జట్టు మొత్తం 1890.1 పాయింట్లు నమోదు చేసింది. ఈ ఈవెంట్లో చైనా 1899.0 పాయింట్లతో స్వర్ణ పతకం సాధించగా.. భారత్ 1890.1 పాయింట్లతో రెండో స్థానంలో నిలిచింది. దక్షిణ కొరియా 1884.2 పాయింట్లతో కాంస్య పతకాన్ని దక్కించుకుంది.
10మీటర్ల ఎయిర్ రైఫిల్ పురుషుల వ్యక్తిగత విభాగంలోనూ భారత్‌కు శుభవార్త అందింది. రుద్రాంక్ష్ పాటిల్, హిమాంశు ధిల్లాన్ వ్యక్తిగత ఫైనల్‌కు అర్హత సాధించారు. రుద్రాంక్ష్ 631.8 పాయింట్లతో, హిమాంశు 630.0 పాయింట్లతో అగ్రశ్రేణిలో నిలిచారు. పార్థ్ మానే 628.3 పాయింట్లు సాధించారు. షూటింగ్లో భారత బృందం పతకాల వేట కొనసాగిస్తోంది. 10మీటర్ల ఎయిర్ రైఫిల్ టీమ్ ఈవెంట్లో సాధించిన రజతంతో ఆసియా క్రీడల్లో భారత పతకాల సంఖ్య మరింత పెరిగింది. వ్యక్తిగత ఫైనల్లో రుద్రాంక్ష్, హిమాంశు ప్రదర్శనపై ఇప్పుడు అందరి దృష్టి నెలకొంది.









Comments