• Aug 25, 2026
  • NPN Log

    ఎల్కతుర్తి: పెళ్లి చేసుకోవాలని ప్రియురాలు ఒత్తిడి చేయడంతో ఆమెను గొంతు నులిమి హత్య చేసిన ప్రియుడిని పోలీసులు అరెస్టు చేశారు. ఈ ఘటనకు ఆమె కన్నతండ్రే ప్రోత్సహించడం విషాదం. హనుమకొండ జిల్లా, ఎల్కతుర్తిలో కారు డిక్కీలో మహిళ మృతదేహం కనిపించడం తీవ్ర కలకలం సృష్టించింది. సోమవారం ఎల్కతుర్తిలోని సీఐ కార్యాలయంలో కాజీపేట ఏసీపీ ప్రశాంత్‌రెడ్డి కేసు వివరాలను వెల్లడించారు. ఈ నెల 21న ఎల్కతుర్తి బస్టాండ్‌ సమీపంలో మార్కెట్‌ చెక్‌ పోస్టు సమీపంలోని రోడ్డు పక్కన పార్కు చేసిన కారులోంచి దుర్వాసన వస్తోందని స్థానికులు పోలీసులకు సమాచారమిచ్చారు. వారొచ్చి కారు డిక్కీలో మహిళ మృతదేహం ఉన్నట్టుగా గుర్తించారు. ఎల్కతుర్తి గ్రామ పంచాయతీ కార్యదర్శి వడ్డేపల్లి శ్రీనివాస్‌ ఫిర్యాదు మేరకు అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేశారు. కారు నంబరు ఆధారంగా మృతురాలు పెద్దపల్లి జిల్లా రాయగిరి మండలం రత్నాపూర్‌లోని సెంటినరీ కాలనీకి చెందిన అంకతి మానస (33)గా, నిందితుడు ఎల్కతుర్తి మండల కేంద్రానికి చెందిన ఎడెళ్లి వినోద్‌ కుమార్‌(33)గా పోలీసులు గుర్తించి దర్యాప్తు ప్రారంభించారు. ఆదివారం మండల కేంద్రంలోని ఓ సీడ్‌ ప్లాంట్‌ వద్ద వినోద్‌ కుమార్‌ ఉన్నాడనే సమాచారం మేరకు అతడిని అదుపులోకి తీసుకుని విచారించారు.

     

    మృతురాలి తండ్రి రాజేశం, నిందితుడి తండ్రి సమ్మరెడ్డి గోదావరిఖని ఏరియాలోని ఓ సింగరేణి మైనింగ్‌లో పని చేశారు. ఒకే కాలనీలో ఉండటంతో మానసకు, వినోద్‌కుమార్‌కు మధ్య స్నేహం ఏర్పడింది. ఉద్యోగ విరమణ తర్వాత వినోద్‌కుమార్‌ తండ్రి ఎల్కతుర్తిలో స్థిరపడ్డాడు. మానసకు గతంలోనే వివాహంమైంది. తర్వాత భర్త నుంచి ఆమె విడాకులు తీసుకుంది. మరోవ్యక్తిని వివాహం చేసుకొని అతడిపైనా కోర్టు లో కేసు వేసింది. ప్రస్తుతం ఆమె తల్లిదండ్రులతోనే ఉంటోంది. కన్నవారి మాట వినకుండా వారిని ఇబ్బందులకు గురిచేస్తోందనే ఆరోపణలున్నాయి. ఈ క్రమంలో స్నేహితుడైన వినోద్‌కుమార్‌తో ఆమెకు సంబంధం ఏర్పడింది. ఈ విషయం ఆమె తల్లిదండ్రులకు తెలిసింది. దీంతో తమ కూతురు మాట వినడం లేదని.. ఏదో ఒకటి చేయాలని పలుమార్లు వినోద్‌కుమార్‌తో రాజేశం అనేవాడు. ఈ నెల 16న అరుణాచలం వెళ్తున్నానని చెప్పి మానస ఇంట్లోంచి బయటకు వెళ్లింది. 18న తల్లిదండ్రులకు ఫోన్‌ చేసి కరీంనగర్‌లో వినోద్‌కుమార్‌తో అతడి అద్దె ఇంట్లో ఉన్నానని తెలిపింది. పెళ్లి చేసుకోవాలని మానస పట్టుబట్టగా, ఇప్పుడు పెళ్లికి తొందరెందుకు? అని వినోద్‌కుమార్‌ అనడంతో గొడవ జరిగింది.

    ఈ విషయాన్ని అతడు మానస తండ్రికి చెప్పాడు. మానస బతికుంటే తమతో పాటు అతడినీ ఇబ్బంది పెడుతుందని.. ఏదో ఒకటి చేసి తమకు ఆ బాధ లేకుండా చేయాలని రాజేశం చెప్పాడు. ఆయన మాటల ప్రేరణ తో వినయ్‌ కుమార్‌ ఆమె గొంతు నులిమి హత్య చేశాడు. మృతదేహాన్ని బెడ్‌ షీట్‌లో మూటగట్టి కారు డిక్కీలో వేసుకుని ఎల్కతుర్తికి తీసుకొచ్చాడు. ఎటు వెళ్లాలో తెలియక రోడ్డు పక్కన కారును పార్క్‌ చేశాడు. కారులోంచి దుర్వాసన రావడంతో హత్య వెలుగులోకొచ్చింది. హత్యకు పాల్పడిన వినోద్‌ కుమార్‌తో పాటు హత్యను ప్రేరేపించిన తండ్రి రాజేశంపై కేసు నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు. వినోద్‌కుమార్‌ను సోమవారం కోర్టులో హాజరుపరిచారు. రాజేశం పరారీలో ఉన్నట్లు ఏసీపీ పేర్కొన్నారు.
     

    You Might Also Like

    Comments

    Leave A Comment

    Don’t worry ! Your email address will not be published. Required fields are marked (*).

    Featured News

    Advertisement