• Aug 25, 2026
  • NPN Log

    హైదరాబాద్‌ : జగన్‌ హయాంలో ఏపీలో జరిగిన మద్యం రవాణా కాంట్రాక్టుల్లో అక్రమాలకు సంబంధించి వైసీపీ నేత, మాజీ మంత్రి కారుమూరి వెంకట నాగేశ్వరరావు, ఆయన కుమారుడు సునీల్‌కుమార్‌ ప్రస్తుతం ఒకే జైలులో, ఒకే బ్యారక్‌లో ఉన్నారు. ఈ కేసులో ఇప్పటికే సునీల్‌ చంచల్‌గూడ జైల్లో ఉండగా.. నాగేశ్వరరావుకు సోమవారం ప్రత్యేక కోర్టు రెండు వారాలు జ్యుడీషియల్‌ రిమాండ్‌ విధించడంతో ఆయన్నూ అక్కడికే తరలించారు. ఈ కేసులో కారుమూరిని ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌ (ఈడీ) అధికారులు ఆదివారం హైదరాబాద్‌ కొండాపూర్‌లో అదుపులోకి తీసుకున్న సంగతి తెలిసిందే. బషీర్‌బాగ్‌లోని ఈడీ ప్రధాన కార్యాలయంలో విచారణ అనంతరం.. మనీలాండరింగ్‌ నిరోధక చట్టం(పీఎంఎల్‌ఏ-2002) కింద ఆయన్ను అరెస్టు చేశారు. సోమవారం నాంపల్లి పీఎంఎల్‌ఏ ప్రత్యేక కోర్టులో హాజరుపరిచారు. కోర్టు రిమాండ్‌కు పంపింది. దీంతో ఈడీ అధికారులు కారుమూరిని చంచల్‌గూడ కేంద్ర కారాగారానికి తరలించారు. ఆయన కుమారుడు సునీల్‌ ఇదే స్కాంలో ఈ ఏడాది జూన్‌ 18నే అరెస్టయి జైల్లో ఉన్నారు. ఆయనకు ముందే ఈ కేసులో అరెస్టయిన రాజ్‌ కసిరెడ్డి, ఏపీ బేవరేజెస్‌ కార్పొరేషన్‌ మాజీ ఎండీ దొంతిరెడ్డి వాసుదేవరెడ్డి కూడా అదే జైల్లో ఉన్నారు. కీలకమైన కేసు కావడంతో తెలంగాణ జైళ్ల శాఖ ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు జైలు వద్ద భద్రతను కట్టుదిట్టం చేశారు. మద్యం రవాణా టెండర్లలో రూ.400 కోట్ల మేర దోపిడీ జరిగిందని, అస్మదీయ సంస్థలకు ప్రయోజనం కలిగేలా నిబంధనలు మార్చి, సబ్‌కాంట్రాక్టులతో భారీమొత్తంలో అక్రమ లాభా లు పొందారని సిట్‌ తేల్చింది. ఇందులో మనీలాండరింగ్‌ కోణంలో విచారణ చేపట్టిన ఈడీ.. రూ.195.33 కోట్ల లావాదేవీలను కనుగొంది. దర్యాప్తులో భాగంగా కేసుతో సంబంధం ఉన్న వారిని అరెస్టులు చేస్తోంది.

     

    You Might Also Like

    Comments

    Leave A Comment

    Don’t worry ! Your email address will not be published. Required fields are marked (*).

    Featured News

    Advertisement