• May 02, 2026
  • NPN Log

    హైదరాబాద్‌ : రాష్ట్రంలో ఉద్యోగులు, ఉపాధ్యాయులు, పెన్షనర్ల సమస్యల పరిష్కారంపై ప్రభుత్వం సానుకూలంగా స్పందించింది. రెండో వేతన సవరణ సంఘం (పీఆర్సీ) ఫిట్‌మెంట్‌పై త్వరలోనే నిర్ణయం తీసుకుంటామని హామీ ఇచ్చింది. పెండింగ్‌లో ఉన్న ఐదు కరువు భత్యాల(డీఏ)ను ఫిట్‌మెంట్‌లో విలీనం చేసి చెల్లిస్తామని తెలిపింది. శుక్రవారం ప్రజాభవన్‌లో డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్కతో ఉద్యోగ సంఘాల సమావేశం జరిగింది. మారం జగదీశ్వర్‌ చైర్మన్‌గా ఉన్న తెలంగాణ ఉద్యోగుల జేఏసీ, లచ్చిరెడ్డి ఆధ్వర్యంలోని జేఏసీ, ట్రెసాలతోపాటు జాయింట్‌ స్టాఫ్‌ కౌన్సిల్‌లో గుర్తింపు ఉన్న సంఘాలు, ఉపాధ్యాయ, పెన్షనర్ల సంఘాలు, ఆహ్వానిత సంఘాల ప్రతినిధులు ఇందులో పాల్గొన్నారు. ఈ సందర్భంగా జేఏసీ నేతలు పీఆర్సీ ఫిట్‌మెంట్‌, డీఏల విడుదల సహా తమ డిమాండ్లను భట్టి విక్రమార్కకు వివరించారు. 63 అంశాలను పరిష్కరించాలని కోరారు. దీనిపై స్పందించిన భట్టి.. రెండో పీఆర్సీ చైర్మన్‌ శివశంకర్‌ నుంచి నివేదిక తెప్పించుకుని, పరిశీలిస్తామని.. తర్వాత మరోసారి ఉద్యోగ సంఘాల నేతలను పిలిపించి మాట్లాడుతామని చెప్పారు. పెండింగ్‌లో ఉన్న ఐదు డీఏలను పీఆర్సీ ఫిట్‌మెంట్‌తో విలీనం చేసి చెల్లిస్తామన్నారు. పెన్షనర్లకు సంబంధించి పెండింగ్‌లో ఉన్న రూ.6,000 కోట్ల బిల్లులను ఏకమొత్తంలో 100 రోజుల్లో చెల్లించడానికి చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. ఉద్యోగుల పెండింగ్‌ బిల్లుల క్లియరెన్స్‌కు ప్రతి నెలా రూ.1,000 కోట్ల చొప్పున విడుదల చేస్తామన్నారు. జూన్‌ 2 నుంచి ఉద్యోగులకు ఆరోగ్య భద్రత కార్డులు జారీ చేస్తామని.. పథకం మార్గదర్శకాలను రూపొందించాల్సిందిగా వెంటనే ప్రభుత్వ ప్రధాన కార్యదర్శికి ఆదేశాలు జారీ చేస్తామని చెప్పారు. ఇక సీపీఎ్‌సను రద్దు చేసి పాత పెన్షన్‌ విధానాన్ని తేవాలని ఉద్యోగ సంఘాల నేతలు కోరగా.. దీనిపై మరోసారి సంఘాల నేతలతో చర్చిస్తామని భట్టి తెలిపారు. ఉద్యోగుల 63 డిమాండ్లలో పాక్షికంగా పరిష్కరించిన 26 డిమాండ్లు, పెండింగ్‌లో ఉన్న 37 డిమాండ్లను జాయింట్‌ స్టాఫ్‌ కౌన్సిల్‌ సమావేశంలో చర్చకు పెట్టి.. 30 రోజుల్లోగా నిర్ణయం తీసుకుంటామని హామీ ఇచ్చారు. అయితే ఈ సమస్యలన్నింటినీ సీఎం రేవంత్‌రెడ్డి దృష్టికి తీసుకెళతానని, తర్వాత ఉద్యోగ సంఘాల నేతలతో మాట్లాడుతానని వివరించారు. 5న తలపెట్టిన నిరాహార దీక్షల నిర్ణయాన్ని విరమించుకోవాలని భట్టి కోరారు. తమపై ఉద్యోగుల నుంచి ఒత్తిడి ఉందని, సీఎంతో మాట్లాడి భేటీ ఏర్పాటు చేయించాలని ఉద్యోగ సంఘాల నేతలు విజ్ఞప్తి చేశారు. ఆ తర్వాత నిరాహార దీక్షలపై నిర్ణయించుకుంటామన్నారు. భేటీలో సంఘాల నేతలు ఏలూరి శ్రీనివాసరావు, దామోదర్‌రెడ్డి, చావ రవి, సదానంద్‌గౌడ్‌, వంగ రవీందర్‌రెడ్డి, ముజీబ్‌ హుస్సేన్‌, వొడ్నాల రాజశేఖర్‌ తదితరులు పాల్గొన్నారు.

    సమస్యల పరిష్కారానికి కృషి: భట్టి

    ఉద్యోగుల సమస్యల పరిష్కారానికి ప్రజా ప్రభుత్వం చిత్తశుద్ధితో కృషి చేస్తోందని ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క తెలిపారు. ప్రభుత్వానికి, ప్రజలకు మధ్య ఉద్యోగులు వారధి అని అభివర్ణించారు. ప్రజా ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు క్షేత్ర స్థాయిలో సామాన్య ప్రజలకు చేరడంలో ఉద్యోగుల పాత్ర కీలకమన్నారు.

    You Might Also Like

    Comments

    Leave A Comment

    Don’t worry ! Your email address will not be published. Required fields are marked (*).

    Featured News

    Advertisement