• May 02, 2026
  • NPN Log

    న్యూఢిల్లీ  : పంజాబ్‌ శాసనసభలో శుక్రవారం తీవ్ర గందరగోళం చోటు చేసుకుంది. ఆమ్‌ ఆద్మీ పార్టీ నేత, ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి భగవంత్‌ మాన్‌ తమ ప్రభుత్వంపై శాసనసభలో విశ్వాస తీర్మానం పెట్టారు. అంతకముందు సీఎం మాన్‌ మద్యం తాగి సభకి వచ్చారంటూ కాంగ్రెస్‌ ఆరోపించడంతో రసాభస జరిగింది. సీఎం మాన్‌ సహా ఎమ్మెల్యేలందరికీ బ్రీత్‌ అనలైజర్‌ పరీక్షలు నిర్వహించాలన్న తమ డిమాండ్‌ను స్పీకర్‌ తిరస్కరించడంతో ప్రతిపక్ష కాంగ్రెస్‌ సభ్యులు సభ నుంచి వాకౌట్‌ చేశారు. ఆపై, సీఎం మాన్‌ ప్రవేశపెట్టిన విశ్వాస తీర్మానం నెగ్గింది. కార్మిక దినోత్సవం సందర్భంగా పంజాబ్‌ శాసనసభ శుక్రవారం ఒక్క రోజు ప్రత్యేకంగా సమావేశమైంది. ఆమ్‌ఆద్మీ పార్టీకి చెందిన ఏడుగురు రాజ్యసభ సభ్యులు గత నెల 24న బీజేపీలో చేరారు. దీంతో పంజాబ్‌లోని ఆప్‌ సర్కారు కూలిపోనుందని, ఆప్‌ ఎమ్మెల్యేలు పార్టీ మారేందుకు సిద్ధంగా ఉన్నారనే ప్రచారం జోరందుకుంది. ఈ నేపథ్యంలో శుక్రవారం నాటి సభలో సీఎం భగవంత్‌ మాన్‌ విశ్వాస తీర్మానాన్ని స్వయంగా ప్రవేశపెట్టారు. తమ పార్టీలో అంతా ఐకమత్యంగానే ఉన్నారని, తమ పార్టీ, ప్రభుత్వానికి వ్యతిరేకంగా జరుగుతున్న తప్పుడు ప్రచారానికి అడ్డుకట్ట వేసేందుకే విశ్వాస తీర్మానాన్ని ప్రవేశపెడుతున్నానని సీఎం మాన్‌ ఈ సందర్భంగా చెప్పారు. విశ్వాస తీర్మానాన్ని ఏకగ్రీవంగా ఆమోదించాలని సభ్యులను కోరారు. శుక్రవారం నిర్వహిస్తున్న ప్రత్యేక శాసనసభ సమావేశానికి అందరూ కచ్చితంగా హాజరుకావాలంటూ ఆప్‌ తమ పార్టీ ఎమ్మెల్యేలందరికీ ముందుగానే విప్‌ కూడా జారీ చేసింది.

    పంజాబ్‌ అసెంబ్లీలో 117 స్థానాలు ఉండగా.. ఆప్‌నకు 94 మంది ఎమ్మెల్యేలు, కాంగ్రె్‌సకు 16, శిరోమణి అకాలీదళ్‌కు ముగ్గురు, బీజేపీకి ఇద్దరు ఎమ్మెల్యేలు ఉన్నారు. వారితోపాటు సభలో ఓ స్వతంత్ర ఎమ్మెల్యే కూడా ఉన్నారు. అయితే, సీఎం మాన్‌ విశ్వాస తీర్మానం ప్రవేశపెట్టే సమయానికి స్వతంత్ర ఎమ్మెల్యే రాణా ఇంద్రప్రతాప్‌ సింగ్‌ మినహా ప్రతిపక్ష సభ్యులు ఎవ్వరూ సభలో లేరు. బీజేపీ సభను బాయ్‌కాట్‌ చేయగా..సీఎం భగవంత్‌ మాన్‌ మద్యం తాగి శాసనసభకు వచ్చారని ఆరోపిస్తూ కాంగ్రెస్‌ సభ్యులు ముందుగానే సభ నుంచి వాకౌట్‌ చేశారు. శుక్రవారం నాటి సభలో సీఎం మాన్‌ ప్రసంగిస్తూ.. కాంగ్రెస్‌ ఎమ్మెల్యే సుఖ్‌పాల్‌ సింగ్‌ ఖైరా సభలో మొబైల్‌ ఫోన్‌ వినియోగిస్తుండడాన్ని తప్పుబట్టారు. ఇందుకు స్పందించిన ఖైరా.. గత సమావేశాల్లో సీఎం సతీమణి విజటర్స్‌ గ్యాలరీలో కూర్చోని మొబైల్‌ ఫోన్‌ వినియోగించారని అన్నారు. దీంతో ఖైరా తీరుపై మాన్‌ ఆగ్రహం వ్యక్తం చేయగా.. సీఎం మద్యం మత్తులో సభకు వచ్చారంటూ ఖైరా తీవ్ర ఆరోపణలు చేశారు. ఈ క్రమంలో సభలో తీవ్ర గందరగోళం నెలకొంది. అయితే, ఖైరా వ్యాఖ్యలకు మద్దతు పలికిన ప్రతిపక్ష నేత ప్రతాప్‌ సింగ్‌ బజ్వా... సీఎంతోపాటు ఎమ్మెల్యేలందరికీ బ్రీత్‌ అనలైజర్‌ పరీక్షలు చేయించాలని స్పీకర్‌కు డిమాండ్‌ చేశారు. ఈ డిమాండ్‌కు స్పీకర్‌ తిరస్కరించగా కాంగ్రెస్‌ సభ్యులంతా సభ నుంచి వాకౌట్‌ చేశారు. మాన్‌పై కాంగ్రెస్‌ ఆరోపణలకు అకాలీదళ్‌ కూడా మద్దతు పలికింది.

     

    You Might Also Like

    Comments

    Leave A Comment

    Don’t worry ! Your email address will not be published. Required fields are marked (*).

    Featured News

    Advertisement