• Jul 27, 2026
  • NPN Log

    గ్లాస్గో: కామన్వెల్త్‌ క్రీడల మూడోరోజు భారత్‌ పతక బోణీ చేసింది. పారా పవర్‌ లిఫ్టింగ్‌లో ఝండు కుమార్‌ కాంస్యం సాధించి భారత్‌ను పాయింట్ల పట్టికలోకి చేర్చాడు. కాగా, మహిళల బాక్సింగ్‌లో లవ్లీనా బోర్గొహెయిన్‌ (75 కిలోలు)కు ఒక్క బౌట్‌ కూడా ఆడకుండానే సెమీఫైనల్‌కు బై లభించడంతో భారత్‌కుఇదివరకే ఓ పతకం ఖరారైన సంగతి తెలిసిందే. శనివారం జరిగిన పోటీలలో పురుషుల హెవీ వెయిట్‌ విభాగంలో బిహార్‌కు చెందిన ఝండూ కుమార్‌ మొత్తం 130.9 పాయింట్లతో మూడోస్థానంలో నిలిచి కాంస్యం సొంతం చేసుకున్నాడు. తొలి రెండు ప్రయత్నాల్లో వరుసగా 181, 190 కిలోలు ఎత్తిన ఝండూ..మూడో యత్నంలో 196 కిలోలు లిఫ్ట్‌ చేయడంలో విఫలమయ్యాడు. నైజీరియాకు చెందిన ఇద్రిస్‌ రిలువన్‌ (132.8 పాయింట్లు) స్వర్ణం, ఇంగ్లండ్‌ లిఫ్టర్‌ మాథ్యూ హార్డింగ్‌ (131) రజతం అందుకున్నారు. మరో భారత లిఫ్టర్‌ సుధీర్‌ (114.1) ఆరో స్థానంలో నిలిచాడు.

    లాన్‌బౌల్స్‌లో రూప ద్వయం హ్యాట్రిక్‌: మహిళల లాన్‌బౌల్స్‌ పెయిర్స్‌ విభాగం సెక్షన్‌-బిలో భారత ద్వయం రూపారాణి, పింకీసింగ్‌ టై బ్రేకర్‌లో 2-0తో టోంగా జోడీ బేకర్‌, మిల్కాను ఓడించి హ్యాట్రిక్‌ విజయాన్ని నమోదు చేసింది. దాంతో రూప జంట గ్రూప్‌లో అగ్రస్థానాన్ని పటిష్టం చేసుకొని సెమీస్‌కు చేరువైంది. పురుషుల లాన్‌బౌల్స్‌ సింగిల్స్‌ సెక్షన్‌-డి మూడో రౌండ్‌లో పుతుల్‌ సోనోవాల్‌ 0-2తో ఇజ్జత్‌ షమీర్‌ (మలేసియా) చేతిలో ఓడాడు.

    జిమ్నాస్టిక్స్‌లో మహిళల జట్టుకు నిరాశ: మహిళల టీమ్‌ ఆర్టిస్టిక్‌ జిమ్నాస్టిక్స్‌లో తెలుగమ్మాయి నిష్కా అగర్వాల్‌, ప్రణతి నాయక్‌, సమంత, ఇషితా రేవాలేతో కూడిన భారత జట్టు పతక రేసు నుంచి నిష్క్రమించింది. క్వాలిఫికేషన్‌ సబ్‌ డివిజన్‌-3లో పోటీ పడిన మన జట్టు మొత్తం 123 పాయింట్లతో ఐదో స్థానంలో నిలిచింది. కాగా.. తపన్‌ మొహంతి, యోగేశ్వర్‌ ఆర్టిస్టిక్‌ జిమ్నాస్టిక్స్‌ పురుషుల ఆల్‌రౌండ్‌ ఫైనల్స్‌కు అర్హత సాధించారు. మొహంతి 71.700 పాయింట్లతో 17వ, యోగేశ్వర్‌ 71.400 పాయింట్లతో 18వ స్థానంలో నిలిచారు. 24మంది జిమ్నా్‌స్టలు ఫైనల్లో తలపడతారు.

     

     

    You Might Also Like

    Comments

    Leave A Comment

    Don’t worry ! Your email address will not be published. Required fields are marked (*).

    Featured News

    Advertisement