• Jul 26, 2026
  • NPN Log

    ఐఫోన్ 18 మరో మూడు నెలల్లో విడుదల కానుంది. ఈ నేపథ్యంలో యాపిల్ సీఈఓ టిమ్ కుక్ పిడుగు లాంటి వ్యాఖ్యలు చేశారు. ఐఫోన్ ధరలను పెంచకతప్పదేమోనని అన్నారు. త్వరలో టిమ్ కుక్ రిటైర్ కానున్న విషయం తెలిసిందే. ఆయన స్థానంలో జాన్ టర్నస్ బాధ్యతలు స్వీకరిస్తారు. ఈ నేపథ్యంలో కస్టమర్లకు ధరల పెంపు వార్తను చెప్పే బాధ్యతను టిమ్ తన భుజాన వేసుకున్నారు. ఫోన్లల్లో వినియోగించే మెమరీ చిప్‌లకు కొరత ఏర్పడిన నేపథ్యంలో ధరలు పెరిగే అవకాశం ఉందని మార్కెట్ నిపుణులు వ్యాఖ్యానిస్తున్నారు. కస్టమర్లపై ధరాభారం పడకుండా తాము ఇప్పటివరకూ అడ్డుకున్నామని సీఈఓ టిమ్ కుక్ తెలిపారు. ఇలా ఎక్కువ కాలం కొనసాగే పరిస్థితి లేదని అన్నారు. ధరల పెంపు తప్పకపోవచ్చని స్పష్టం చేశారు. ఐఫోన్‌లోని విడిభాగాల ధరలు ఇప్పటికే పెరిగినా ఆ భారాన్ని తామే భరించామని అన్నారు.

     

    ప్రపంచంలో అత్యధికంగా మెమరీ చిప్‌లను వినియోగించే కంపెనీల్లో యాపిల్ ప్రథమస్థానంలో కొనసాగుతోంది. అయితే, ఏఐ కంపెనీల రాకతో టెక్ రంగంలో కీలక మార్పులు చోటుచేసుకుంటున్నాయి. ఏఐ కంపెనీలు కూడా మెమరీ చిప్‌లను భారీగా వినియోగిస్తున్నాయి. దీంతో, వీటికి కొరత ఏర్పడింది. ఫలితంగా ధరలు పెరుగుతున్నాయి. ఈ ప్రభావం ఐఫోన్‌లపైనా పడింది. పెరిగిన ధరల కారణంగా ఒక్కో ఐఫోన్ 18కు 150 డాలర్ల చొప్పున యాపిల్‌పై అదనపు భారం పడుతోందని టెక్ వర్గాలు చెబుతున్నాయి. ఇక త్వరలో మెమరీ చిప్‌ల వినియోగంలో ఏఐ కంపెనీలు యాపిల్‌ను వెనక్కు నెట్టే అవకాశం ఉందన్న విశ్లేషణలూ వెలువడతున్నాయి.

    You Might Also Like

    Comments

    Leave A Comment

    Don’t worry ! Your email address will not be published. Required fields are marked (*).

    Featured News

    Advertisement