• Jul 27, 2026
  • NPN Log

    ఫిఫా ప్రపంచ కప్ 2026 ఫైనల్‌లో అర్జెంటీనా పరాజయం అనంతరం తొలిసారిగా స్టార్ ఫుట్‌బాలర్ లియోనెల్ మెస్సి బహిరంగంగా కనిపించాడు. ప్రస్తుతం కుటుంబ సభ్యులతో కలిసి తన స్వస్థలం రోసారియోలో విశ్రాంతి తీసుకుంటున్న మెస్సి.. ఆంటోనియో డి జియాకోమో స్టేడియంలో జరిగిన ప్రిమెరా సీ లీగ్ మ్యాచ్‌ను వీక్షించాడు. లియోనెస్ ఎఫ్‌సీ, సెంట్రల్ కోర్డోబా జట్ల మధ్య జరిగిన ఈ మ్యాచ్‌కు మెస్సి హాజరయ్యాడు. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

    ఎవరూ గుర్తుపట్టకుండా ఉండేందుకు నల్లటి హుడీ ధరించి మారువేషంలో కనిపించాడు. అయినప్పటికీ అభిమానుల కంట పడకుండా ఉండలేకపోయాడు. బాల్కనీలో కూర్చొని మ్యాచ్‌ను వీక్షిస్తున్న మెస్సిని అభిమానులు, టీవీ కెమెరాలు గుర్తించాయి. చిన్నారులు, అభిమానులు అతడి పేరుతో గట్టిగా అరుస్తుండగా.. చిరునవ్వుతో చేయి ఊపుతూ అభివాదం చేశాడు. దీంతో స్టేడియం మొత్తం చప్పట్లతో మార్మోగింది. అయితే మెస్సి హాజరైనా లియోనెస్ ఎఫ్‌సీకి అదృష్టం కలిసిరాలేదు. సెంట్రల్ కోర్డోబా చేతిలో 0-2 తేడాతో ఓటమి చవిచూసింది.

    ఆ మ్యాచ్‌లో మెస్సికి మినహాయింపు

    ప్రపంచ కప్ ఫైనల్‌లో అర్జెంటీనా తరఫున ఆడిన నేపథ్యంలో వచ్చే వారం జరిగే మేజర్ లీగ్ సాకర్ (MLS) ఆల్‌స్టార్ గేమ్‌లో పాల్గొనాల్సిన అవసరం లేదని లీగ్ నిర్వాహకులు స్పష్టం చేశారు. సాధారణంగా ఆల్‌స్టార్ మ్యాచ్‌లో ఎంపికైన ఆటగాళ్లు తప్పనిసరిగా ఆడాల్సి ఉంటుంది. అయితే ఈసారి ప్రపంచ కప్ టోర్నీ ఎంఎల్ఎస్ సీజన్ మధ్యలో జరగడంతో, ఫైనల్ దశ వరకు వెళ్లిన ఆటగాళ్లకు ముందుగానే ప్రత్యేక మినహాయింపు కల్పించారు. ఈ ఏడాది ఆల్‌స్టార్ జట్టులో మెస్సి పేరు ప్రకటించినప్పటికీ, అతడి స్థానంలో ఇతర ప్లేయర్‌కు అవకాశం కల్పించనున్నారు.

    You Might Also Like

    Comments

    Leave A Comment

    Don’t worry ! Your email address will not be published. Required fields are marked (*).

    Featured News

    Advertisement