• Sep 21, 2026
  • NPN Log

    అమరావతి : బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం బలపడి వాయుగుండంగా మారే అవకాశముందని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విపత్తుల నిర్వహణ సంస్థ (ఏపీఎస్‌డీఎమ్ఏ) తెలిపింది. ఉత్తర అండమాన్, తూర్పు మధ్య బంగాళాఖాతంలో కొనసాగుతున్న అల్పపీడనం ప్రస్తుతం పశ్చిమ-వాయువ్య దిశగా కదులుతోంది. రాబోయే 24 గంటల్లో ఇది వాయుగుండంగా మారుతుందని ఏపీఎస్‌డీఎమ్ఏ అంచనా వేసింది, అలాగే ఆ తరువాతి 24 గంటల్లో తీవ్ర వాయుగుండంగా బలోపేతమవుతుందని హెచ్చరించింది. ఎల్లుండి ఉదయానికి దక్షిణ ఒడిశా-ఉత్తరాంధ్ర తీరాలకు ఈ వాయుగుండం చేరుకుంటుందని చెప్పింది. దీని ప్రభావంతో నేడు, రేపు రాష్ట్రంలో చెదురుమదురుగా భారీ వర్షాలు కురుస్తాయని వెల్లడించింది. అలాగే బుధ, గురువారాల్లో అక్కడక్కడ భారీ నుంచి అతి భారీ వర్షాలు పడతాయని ప్రకటించింది.

    ఇవాళ అల్లూరి, పోలవరం, నంద్యాల, కడప జిల్లాల్లో అక్కడక్కడ పిడుగులతో కూడిన మోస్తరు వర్షాలు కురుస్తాయని రాష్ట్ర విపత్తుల నిర్వహణ సంస్థ తెలిపింది. మిగతా జిల్లాల్లోనూ తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు పడే అవకాశాలున్నాయని వివరించింది. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాలని సూచించింది. ప్రస్తుతం సముద్రం అల్లకల్లోలంగా ఉందని, ఎట్టి పరిస్థితుల్లో మత్స్యకారులు వేటకు వెళ్ళకూడదని ఏపీఎస్‌డీఎమ్ఏ ఎండీ ప్రఖర్ జైన్ హెచ్చరికలు జారీ చేశారు.

    You Might Also Like

    Comments

    Leave A Comment

    Don’t worry ! Your email address will not be published. Required fields are marked (*).

    Featured News

    Advertisement