నందిగామలో రూ.4 కోట్ల కరెన్సీతో కొలువుదీరిన గణనాథుడు..
ఎన్టీఆర్ : జిల్లాలోని నందిగామలోని వాసవి మార్కెట్‌లో ఏర్పాటు చేసిన కరెన్సీ గణనాథుడు భక్తులను విశేషంగా ఆకట్టుకుంటున్నాడు. గణేశ్ ఉత్సవ కమిటీ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ఈ వినాయకుడిని ఏకంగా రూ.4 కోట్ల విలువైన కరెన్సీ నోట్లతో అలంకరించడం ప్రత్యేక ఆకర్షణగా మారింది. 44 ఏళ్లుగా ఇదే ప్రాంతంలో గణేశ్ విగ్రహాన్ని ఏర్పాటు చేస్తూ వస్తున్న కమిటీ.. ప్రతి ఏడాదీ వినూత్నంగా అలంకరణలు చేస్తూ భక్తులను ఆకట్టుకుంటోంది. గతేడాది సైతం రూ.3.33 కోట్ల విలువైన కరెన్సీతో వినాయకుడిని అలంకరించగా, ఈసారి ఆ మొత్తాన్ని మరింత పెంచి రూ.4 కోట్లకు చేర్చింది. దీంతో ఈ కరెన్సీ గణనాథుడిని చూసేందుకు నందిగామతో పాటు చుట్టుపక్కల ప్రాంతాల నుంచి భక్తులు పెద్ద సంఖ్యలో తరలివస్తున్నారు.
ఈ ప్రత్యేక అలంకరణ కోసం మార్కెట్‌లోని వ్యాపారస్తుల నుంచి కరెన్సీ నోట్లను సేకరించినట్లు గణేశ్ ఉత్సవ కమిటీ నిర్వాహకులు తెలిపారు. అయితే ఈ డబ్బును కమిటీ సొంతంగా వినియోగించుకోవడం లేదని, ఉత్సవాలు ముగిసిన మరుసటి రోజే ఎవరి డబ్బులు వారికి తిరిగి అందజేస్తామని చెబుతున్నారు. దీంతో భక్తుల్లోనూ, వ్యాపార వర్గాల్లోనూ ఈ కరెన్సీ గణనాథుడిపై ఆసక్తి నెలకొంది. భారీ మొత్తంలో నోట్లతో వినాయకుడిని అలంకరించడంతో వాసవి మార్కెట్ ప్రస్తుతం సందడిగా మారింది. నాలుగు కోట్ల రూపాయల కరెన్సీతో కొలువుదీరిన గణనాథుడిని చూసేందుకు భక్తులు ఆసక్తిగా తరలివస్తుండటంతో ఈ ప్రత్యేక వినాయకుడి అలంకరణ నందిగామలో ప్రధాన ఆకర్షణగా నిలిచింది.









Comments