బాదేసి.. కూల్చేసి
హరారే: అటు బ్యాట్‌తో.. ఇటు బంతితోనూ ఆతిథ్య జింబాబ్వేపై టీమిండియా విరుచుకుపడింది. ఫలితంగా..రెండో టీ20లో భారత్ ఏకంగా 90 పరుగుల భారీ తేడాతో ఘనవిజయం సాధించింది. దీంతో మూడు టీ20ల ఈ సిరీ్‌సను మరో మ్యాచ్ ఉండగానే 2-0తో దక్కించుకుంది. ఆఖరిదైన మూడో మ్యాచ్ ఆదివారం జరుగుతుంది. శ్రేయాస్ అయ్యర్‌కు కెప్టెన్‌గా ఇదే తొలి సిరీస్ కావడం విశేషం. శనివారం జరిగిన ఈ మ్యాచ్‌లో ముందుగా భారత్ 20 ఓవర్లలో 5 వికెట్లకు 219 పరుగులు చేసింది. ఇషాన్ కిషన్ (44 బంతుల్లో 9 ఫోర్లు, 2 సిక్సర్లతో 81), తిలక్ వర్మ (29 బంతుల్లో 5 ఫోర్లు, 3 సిక్సర్లతో 60 నాటౌట్) అర్ధసెంచరీలతో అదరగొట్టారు. భారీ ఛేదనలో భారత బౌలింగ్ ధాటికి.. జింబాబ్వే 17.5 ఓవర్లలో 129 పరుగులకే కుప్పకూలింది. ఆరంభంలో బెనెట్ (32) ధనాధన్ బ్యాటింగ్‌తో ఆకట్టుకున్నాడు. కానీ తను నాలుగో ఓవర్‌లోనే వెనుదిరగడంతో వికెట్ల పతనం మొదలైంది. ప్రిన్స్ యాదవ్ (2/10), అరంగేట్ర పేసర్ యష్ ఠాకూర్ (2/30) వారినే మాత్రం కుదురుకోనీయలేదు. ఆ తర్వాత తడివనషె (24) మాత్రమే రాణించాడు. ప్రిన్స్ ఆట మధ్యలోనే గాయంతో పెవిలియన్ చేరాడు. మూడు వికెట్లతో అభిషేక్ టెయిలెండర్ల పనిబట్టాడు. ‘ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్’గా ఇషాన్ నిలిచాడు.
ఇషాన్-తిలక్ జోరు: టాస్ ఓడి బ్యాటింగ్‌కు దిగిన భారత్ ఇన్నింగ్స్‌లో ఇషాన్, తిలక్ హాఫ్ సెంచరీలతో ఆకట్టుకున్నారు. 29 పరుగులకే ఓపెనర్లు అభిషేక్ (8), వైభవ్ సూర్యవంశీ (9 బంతుల్లో 3 ఫోర్లు, 1 సిక్సర్‌తో 20) వెనుదిరగడంతో భారత్ కష్టాల్లో పడినట్టనిపించింది. కానీ ఇషాన్ అద్భుత బ్యాటింగ్‌తో పరిస్థితిని చక్కదిద్దాడు. సారథి శ్రేయాస్ (25)తో కలిసి మూడో వికెట్‌కు 66 పరుగుల భాగస్వామ్యాన్ని అందించాడు. పదో ఓవర్‌లో శ్రేయాస్ వెనుదిరిగాక తిలక్‌తో కలిసి ఇషాన్ కదం తొక్కాడు. ఈ జోడీ నాలుగో వికెట్‌కు 94 పరుగులు అందించింది. ఇక తిలక్, రింకూ (12) చెరో సిక్సర్‌తో 18వ ఓవర్‌లో జట్టు స్కోరు 200 దాటింది.










Comments