• Sep 20, 2026
  • NPN Log

    వాషింగ్టన్‌ : విదేశీ ఉద్యోగులను హెచ్‌1బీ వీసాలపై తీసుకునేందుకు కంపెనీలు చెల్లించాల్సిన లక్ష డాలర్ల (రూ.95 లక్షలు) ఫీజును అమెరికా అధ్యక్షుడు ట్రంప్‌ మరో ఏడాదిపాటు పొడిగించారు. గత ఏడాది జారీ చేసిన ఆదేశాల గడువు ఈ నెలాఖరుతో ముగుస్తుండటంతో శనివారం ఉత్తర్వులు ఇచ్చారు. ఈ ఫీజు వల్ల పెద్ద ఐటీ కంపెనీల నుంచి హెచ్‌1బీ వీసాల కోసం రిజిస్ట్రేషన్లు 92ు తగ్గిపోయాయని అందులో ట్రంప్‌ పేర్కొన్నారు. ‘‘అమెరికా ఆర్థిక, జాతీయ భద్రత ప్రయోజనాలను కాపాడేందుకు హెచ్‌1బీ దరఖాస్తుల కోసం లక్ష డాలర్ల ఫీజును మరో ఏడాది పాటు పొడిగించాలని నిర్ణయించాం. అమెరికా కార్మికులు, గ్రాడ్యుయేట్లకు ఉద్యోగ మార్కెట్‌లో అవకాశాలు మెరుగుపడతాయి. అవసరమైతేనే కంపెనీలు అత్యంత నైపుణ్యం, ప్రాధాన్యం ఉన్న విదేశీ ఉద్యోగులను నియమించుకుంటాయి’’ అని ట్రంప్‌ పేర్కొన్నారు. ఇప్పటికే అమెరికాలో విద్యార్థి వీసాలపై చదువుకుంటున్న వారికి, ఇప్పటికే హెచ్‌1బీ వీసాలు ఉన్నవారి రెన్యూవల్స్‌కు ఈ ఫీజు వర్తించదు. కంపెనీలు కొత్తగా విదేశీ ఉద్యోగులను తీసుకుంటే మాత్రం ఈ ఫీజు చెల్లించాల్సి ఉంటుంది. ఇక హెచ్‌1బీ వీసాలను స్పాన్సర్‌ చేసే సంస్థలు, దరఖాస్తులపై మరింత కఠినంగా పరిశీలన చేపట్టాలంటూ ట్రంప్‌ మరో ఉత్తర్వు జారీ చేశారు. ముఖ్యంగా అమెరికన్‌ ఉద్యోగులను తొలగించే అవకాశమున్న కంపెనీలు చేసే హెచ్‌1బీ దరఖాస్తులను నిశితంగా పరిశీలించాలని, నిబంధనలను కఠినంగా అమలు చేయాలని ఆదేశించారు. ఇక తనపై తప్పుడు, ప్రతికూల వార్తలు రాస్తున్నాయంటూ సీఎన్‌ఎన్‌, ఎంఎస్‌ నౌ, పొలిటికో వార్తా సంస్థల ప్రతినిధులు వైట్‌హౌజ్‌లోకి రాకుండా ట్రంప్‌ నిషేధం విధించారు.

     

    భారత్‌పై సుంకాల పెంపు ఉండకపోవచ్చు

    రష్యా, ఇరాన్‌ దేశాలపై మరిన్ని ఆంక్షలు, రష్యా నుంచి చమురు కొనే దేశాలపై 100ు వరకు అదనపు సుంకాలు విధించే బిల్లుపై ట్రంప్‌ సంతకం చేశారు. ఏయే సంస్థలు, వ్యక్తులపై ఆంక్షలు విధించాలి, ఏయే దేశాలపై, ఎంతెంత సుంకాలు వేయాలి, ఎవరికి మినహాయింపులు ఇవ్వాలన్న విచక్షణాధికారాలు ఇక అధ్యక్షుడి చేతిలోనే ఉంటాయి. ఈ చట్టం 30 రోజుల తర్వాతి నుంచి పూర్తిస్థాయిలో అమల్లోకి వస్తుంది. ఈ గడువులోగా ఇరాన్‌, రష్యాలపై ఆంక్షలను, రష్యా నుంచి భారీగా చమురుకొనే దేశాల వివరాలను అధ్యక్షుడు సమీక్షిస్తారు. గత ఏడాది కాలంలో రష్యా నుంచి అత్యధికంగా చమురు దిగుమతి చేసుకున్న టాప్‌-5 దేశాల ఉత్పత్తులపై 100ు వరకు సుంకాలు విధిస్తారు. ఇంతకుముందు ట్రంప్‌ ఏకపక్షంగా విధించిన సుంకాలను కోర్టులు కొట్టివేశాయి. కానీ ఇప్పుడీ చట్టం ఆధారంగా ట్రంప్‌ సుంకాలకు మార్గం సుగమమైంది. రష్యా నుంచి అత్యధికంగా చమురు దిగుమతి చేసుకుంటున్న దేశం చైనాకాగా, రెండో స్థానంలో భారత్‌ ఉంది. అమెరికా ఒత్తిడితో రష్యా నుంచి చమురు కొనుగోళ్లను భారత్‌ కొంతమేర తగ్గించుకున్నా.. ఇప్పటికీ గణనీయ స్థాయిలో దిగుమతులు జరుగుతున్నాయి. ఇప్పటికిప్పుడు ట్రంప్‌ భారత్‌పై భారీగా సుంకాలు వేసే అవకాశం లేదని నిపుణులు అంచనా వేస్తున్నారు. ఇరుదేశాల మధ్య వాణిజ్య ఒప్పందంపై చర్చలు తుదిదశలో ఉన్నాయని గుర్తు చేస్తున్నారు. మరోవైపు, భారత్‌ మరే దేశం ఒత్తిడికి తలొగ్గదని విదేశాంగ శాఖ సహాయ మంత్రి కీర్తివర్ధన్‌ సింగ్‌ స్పష్టం చేశారు. ‘‘మా దేశం, ప్రజల ప్రయోజనాలే మాకు ముఖ్యం’’ అని స్పష్టం చేశారు.

    You Might Also Like

    Comments

    Leave A Comment

    Don’t worry ! Your email address will not be published. Required fields are marked (*).

    Featured News

    Advertisement