• Sep 20, 2026
  • NPN Log

    సౌదీ అరేబియా రాజధాని రియాద్‌లో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. రియాద్‌లోని కింగ్ ఖాలిద్ అంతర్జాతీయ విమానాశ్రయం సమీపంలోని ఇంధన నిల్వ కేంద్రంలో శనివారం భారీ మంటలు చెలరేగాయి. రాజధానిలోని కొన్ని సున్నితమైన ప్రాంతాలను లక్ష్యంగా చేసుకుని క్షిపణులు, డ్రోన్లతో దాడులు నిర్వహించినట్లు యెమెన్‌కు చెందిన హౌతీలు ప్రకటించారు. రియాద్ విమానాశ్రయం సమీపంలోని ఇంధన నిల్వ కేంద్రంలో సౌదీ చమురు సంస్థ ఆరామ్‌కోకు చెందిన ఒక ఇంధన ట్యాంక్‌లో మంటలు చెలరేగాయి. అగ్నిమాపక సిబ్బంది మంటలను అదుపులోకి తీసుకువచ్చినట్లు సమాచారం. అయితే ఈ మంటలు హౌతీల దాడి వల్లే సంభవించాయని సౌదీ అధికారులు ఇంకా ధ్రువీకరించలేదు. హౌతీల దాడుల వల్లే ఈ భారీ మంటలు చెలరేగాయా అనే విషయంలో ఇంకా స్పష్టత లేదు. కాగా, రియాద్ వైపు హౌతీలు ఒక బాలిస్టిక్ క్షిపణిని ప్రయోగించారని, దాన్ని సౌదీ వైమానిక రక్షణ వ్యవస్థ ధ్వంసం చేసినట్లు సౌదీ నేతృత్వంలోని కూటమి తెలిపింది.

    దాడుల కారణంగా రియాద్‌లోని కింగ్ ఖాలిద్ అంతర్జాతీయ విమానాశ్రయంలో విమాన రాకపోకలకు కొంత అంతరాయం ఏర్పడినట్లు 'ఫ్లైట్‌రాడార్‌24' తెలిపింది. తరువాత విమాన సర్వీసులు సాధారణ స్థితికి చేరుకున్నాయి. దాడుల ముప్పు నేపథ్యంలో రియాద్, అల్-ఖర్జ్ ప్రాంతాల్లో ప్రజలకు సౌదీ అధికారులు హెచ్చరికలు జారీ చేశారు. అప్రమత్తంగా ఉండాలని సూచించారు.

    కాగా, సౌదీపై దాడుల గురించి హౌతీ సైనిక ప్రతినిధి యహ్యా సరీ ప్రకటన చేశారు. రియాద్‌లోని సున్నితమైన ప్రాంతాలను, ఎర్ర సముద్ర తీరంలోని యన్బులో ఉన్న ఆరామ్‌కో చమురు క్షేత్రాన్ని లక్ష్యంగా చేసుకుని రెండు దాడులు చేపట్టినట్లు ఆయన పేర్కొన్నారు. ఈ దాడుల్లో పెద్ద సంఖ్యలో బాలిస్టిక్ క్షిపణులు, క్రూయిజ్ క్షిపణులు, డ్రోన్లు ఉపయోగించినట్లు వెల్లడించారు.

    You Might Also Like

    Comments

    Leave A Comment

    Don’t worry ! Your email address will not be published. Required fields are marked (*).

    Featured News

    Advertisement