రాహుల్ ప్రధాని అయితేనే ఈసీ కంట్రోల్లో ఉంటుంది
సంగారెడ్డి : ’రాహుల్‌గాంధీ ప్రధానమంత్రి అయితేనే ఎన్నికల కమిషన్ కంట్రోల్లో ఉంటుంది. అప్పటిదాకా ఈ ఓట్ల పంచాయతీలు ఇలాగే ఉంటాయి.. ఎందుకంటే ప్రధాని మోదీ ఏం చెబితే ఎన్నికల కమిషన్ అదే చేస్తోంది. అందుకే కొన్ని రాష్ట్రాల్లో ఓట్ల తొలగింపు తర్వాత బీజేపీకి అనుకూల ఫలితాలు వచ్చాయి’ అని టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ జగ్గారెడ్డి వ్యాఖ్యానించారు. సీఎం రేవంత్‌రెడ్డి, ఏఐసీసీ ఇన్చార్జి మీనాక్షి నటరాజన్, టీపీసీసీ చీఫ్ మహేశ్‌గౌడ్ జూమ్ మీటింగ్‌లో చేసిన సూచనల మేరకు సంగారెడ్డిలో బుధవారం సాయంత్రం అత్యవసర సమావేశం ఏర్పాటు చేశారు. ఎస్ఏఆర్పై కాంగ్రె్‌సకు చెందిన బూత్‌లెవల్ ఏజెంట్లు, పార్టీ ముఖ్యనేతలకు జగ్గారెడ్డి దిశానిర్దేశం చేశారు. ఓట్ల సవరణ కుట్రపై రాహుల్‌గాంధీ పార్లమెంట్లో కొట్లాడుతున్నారని చెప్పారు. రాహుల్ ప్రధాని కావాలంటే మనమందరం జాగ్రత్తగా ఉండాలని అన్నారు. వచ్చే ఎన్నికల్లో 543 ఎంపీ స్థానాలకుగాను 300 చోట్ల కాంగ్రెస్ గెలవాలని, అందులో మెదక్ పార్లమెంటు కూడా ఉండాలని పిలుపునిచ్చారు. కాంగ్రెస్ ఓట్లను తొలగించడానికి బీజేపీ చేస్తున్న కుట్రలను బీఎల్ఏలు అడ్డుకోవాలని సూచించారు. ఎక్కువ స్థానాల్లో గెలవడం ద్వారానే దుర్మార్గమైన మోదీ పాలనకు తెర పడుతుందని అన్నారు.










Comments