• Jun 25, 2026
  • NPN Log

    అమరావతి : ఉపముఖ్యమంత్రి, జనసేన అధినేత పవన్‌ కల్యాణ్‌ వారాహి దీక్ష చేపట్టారు. ఈ సందర్భంగా బుధవారం గుంటూరు జిల్లా మంగళగిరిలోని మంగళాద్రి శ్రీలక్ష్మీనృసింహస్వామి వారిని ఆయన దర్శించుకున్నారు. నృసింహాలయంలో ప్రత్యేక అర్చనలు చేయించిన అనంతరం పవన్‌ కల్యాణ్‌ వారాహి దీక్ష చేపట్టారు. ఆయన ఏటా జ్యేష్ఠ మాసంలో దీక్షను ప్రారంభించి, కార్తీక మాసంలో విరమిస్తారు. గురుముఖత స్వీకరించిన మంత్రోపదేశం ఆచరణ కోసం ఆయన ఈ దీక్షను క్రమం తప్పకుండా యేటా స్వీకరిస్తున్నారు. దీక్షా కాలంలో నియమితమైన జీవనంతోపాటు సాత్విక ఆహారం తీసుకుంటూ విధి నిర్వహణకు అనుగుణంగా వస్త్రాలను ధరిస్తూ ఉంటారు. ఎక్కువగా చందన వర్ణ వస్త్రధారణను ధరిస్తుంటారు. పవన్‌కల్యాణ్‌ తొలుత లక్ష్మీనృసింహస్వామి, రాజ్యలక్ష్మీ అమ్మవార్లను దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. దేవస్థానం కార్యనిర్వహణాధికారి, అర్చకస్వాములు ఆలయ మర్యాదలతో ఉపముఖ్యమంత్రికి స్వాగతం పలికారు. దిగువ సన్నిధిలో రామవరప్పాడు మాజీ సర్పంచ్‌ వర్రి శ్రీదేవి మనవరాలు జువిష్యకు పవన్‌.. అన్నప్రాసన చేశారు. అనంతరం ఎగువ సన్నిధిలో శ్రీ పానకాలస్వామిని దర్శించుకుని తీర్థప్రసాదాలను స్వీకరించారు.

    28 మంది సభ్యులతో కమిటీలు నియామకం..

    పార్టీని సంస్థాగతంగా మరింత బలోపేతం చేసి, జనసైనికుల నుంచే భవిష్యత్‌ నాయకత్వాన్ని తీర్చిదిద్దే లక్ష్యంతో తన స్వీయ పర్యవేక్షణలో ‘జనసేన పార్టీ నిర్మాణ సారథుల సమాచార సేకరణ కమిటీ’లను నియమిస్తున్నట్లు జనసేన అధినేత పవన్‌ కల్యాణ్‌ ప్రకటించారు. ఈ మేరకు ఎక్స్‌లో ఆయన పోస్టు చేశారు. ప్రతి పార్లమెంటరీ నియోజకవర్గానికి చెందిన ఒక సీనియర్‌ పరిశీలకడు, పార్టీపై నిబద్ధత, స్థానిక సమస్యలపై అవగాహన ఉన్న ముగ్గురు సీనియర్‌ నాయకులను కమిటీలో నియమించారు. వార్షిక సభ్యత్వ నమోదులో నిరంతరం పాల్గొన్న ముగ్గురు సాధకులు, ప్రతి అసెంబ్లీ నియోజకవర్గం నుంచి కనీసం ముగ్గురు సాధకులు, మొత్తం 28 మందితో ఈ కమిటీలను ఏర్పాటు చేశారు. ఈ కమిటీలకు సహాయ సహకారాలు అందించేందుకు పార్టీ కేంద్ర కార్యాలయం నుంచి ఐదుగురు సిబ్బందిని అందుబాటులో ఉంచారు.

    You Might Also Like

    Comments

    Leave A Comment

    Don’t worry ! Your email address will not be published. Required fields are marked (*).

    Featured News

    Advertisement