విద్యార్థులకు కేంద్రం గుడ్‌న్యూస్.. ఘన వ్యర్థాల నిర్వహణపై జాతీయ స్థాయి క్విజ్
విద్యార్థులకు కేంద్ర ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పింది. కేంద్ర విద్యా శాఖ 6 నుంచి 12వ తరగతి విద్యార్థుల కోసం ‘ఘన వ్యర్థాల నిర్వహణ’పై జాతీయ స్థాయి క్విజ్ నిర్వహిస్తోంది. ఈ క్విజ్‌ను ‘స్వచ్ఛతా హి సేవా 2026’ కార్యక్రమంలో ‘భాగంగా ఎకో క్లబ్స్ ఫర్ మిషన్ లైఫ్’ పోర్టల్ ద్వారా నిర్వహిస్తున్నారు. ఈ క్విజ్‌లో పాల్గొనడం ద్వారా చెత్తను ఎలా సరిగ్గా నిర్వహించాలి, పర్యావరణాన్ని ఎలా శుభ్రంగా, పచ్చగా ఉంచాలి అనే విషయాలపై విద్యార్థులు అవగాహన పెంచుకోవచ్చు.
విద్యార్థులు సెప్టెంబర్ 17 నుంచి అక్టోబర్ 17 వరకు ఈ జాతీయ స్థాయి క్విజ్‌లో పాల్గొనవచ్చని కేంద్ర విద్యా శాఖ తెలిపింది. ఈ కార్యక్రమానికి సంబంధించిన వివరాలను ఎక్స్‌లో వెల్లడించింది. విద్యార్థుల కోసం వివిధ తరగతులకు సంబంధించిన స్టడీ మెటీరియల్‌ను కూడా విద్యా శాఖ తన అధికారిక పోర్టల్ ‘ఎకోక్లబ్స్.ఎడ్యుకేషన్.గవ్.ఇన్’ లో అందుబాటులో ఉంచింది.
ఈ వివరాలు నమోదు చేయాలి
క్విజ్‌లో పాల్గొనే సమయంలో విద్యార్థులు తమ పేరు, తరగతి, వయసు, పాఠశాల యూడీఐఎస్ఈ కోడ్ వంటి వివరాలను నమోదు చేయాలి. కాగా.. చెత్తను నాలుగు రకాలుగా వేరు చేయాలని విద్యా శాఖ తెలిపింది. ఇళ్లలో, పాఠశాలల్లో ఉత్పత్తి అయ్యే చెత్తను అక్కడికక్కడే వేరు చేయాలి. తడి చెత్త, పొడి చెత్త, శానిటరీ వ్యర్థాలు, స్పెషల్ కేర్ వేస్ట్‌గా చెత్తను వేరు చేయాలని విద్యా శాఖ తెలిపింది. ఇలా వేరు చేసిన చెత్తను గుర్తింపు పొందిన చెత్త సేకరణ సిబ్బందికి అప్పగించాలి.










Comments