వరుస నష్టాలకు బ్రేక్.. 500 పాయింట్లు లాభపడిన సెన్సెక్స్..
వరుసగా నాలుగు రోజులు నష్టాలనే చవిచూసిన సెన్సెక్స్ శుక్రవారం కోలుకుంది. భారీ లాభాలతో రోజును ముగించింది. డాలర్‌తో పోల్చుకుంటే రూపాయి కాస్త బలపడింది. అలాగే, విదేశీ సంస్థాగత మదుపర్ల గురువారం రూ. 600 కోట్ల విలువైన షేర్లను కొనుగోలు చేశారు. అలాగే ఐటీ రంగంపై మదుపర్ల ఆసక్తి సూచీలను ముందుకు నడిపించింది. దీంతో వారంలో చివరి రోజు సెన్సెక్స్, నిఫ్టీ లాభాలు ఆర్జించాయి.
గత సెషన్ ముగింపు (84, 481)తో పోల్చుకుంటే శుక్రవారం ఉదయం దాదాపు 250 పాయింట్ల లాభంతో మొదలైన సెన్సెక్స్ రోజంతా లాభాల్లోనే ట్రేడ్ అయింది. ఒక దశలో 85 వేల మార్క్ కూడా దాటి ఇంట్రాడే గరిష్టానికి చేరుకుంది. చివరకు సెన్సెక్స్ 447 పాయింట్ల లాభంతో 84, 929 వద్ద రోజును ముగించింది. మరో వైపు నిఫ్టీ కూడా సెన్సెక్స్ బాటలోనే కదలాడింది. చివరకు 150 పాయింట్ల లాభంతో 25, 966 వద్ద స్థిరపడింది.
సెన్సెక్స్‌లో టాటా ఎలాక్సీ, వోడాఫోన్ ఐడియా, కేపీఐటీ టెక్నాలజీస్, ఎన్బీసీసీ, కేఈఐ ఇండస్ట్రీస్ మొదలైన షేర్లు లాభాలు ఆర్జించాయి (share market news). బ్లూ స్టార్, చోలా ఇన్వెస్ట్, వోల్టాస్, హెచ్డీఎఫ్సీ ఏఎమ్‌సీ, నవుమా వెల్త్ షేర్లు నష్టాలను మూటగట్టుకున్నాయి. బ్యాంక్ నిఫ్టీ 156 పాయింట్లు లాభపడింది. నిఫ్టీ మిడ్ క్యాప్ ఇండెక్స్ 718 పాయింట్లు ఆర్జించింది. డాలర్‌తో పోల్చుకుంటే రూపాయి మారకం విలువ 89.27గా ఉంది.









Comments