సీబీఎస్ఈ కీలక నిర్ణయం.. 9, 10వ తరగతి విద్యార్థులు థర్డ్ లాంగ్వేజ్‌లోనూ ఉత్తీర్ణులవ్వాల్సిందే..
కేంద్ర మాధ్యమిక విద్యా మండలి (CBSE) 9, 10వ తరగతి విద్యార్థులకు సంబంధించి కీలక నిర్ణయం తీసుకుంది. జాతీయ విద్యా విధానం (NEP-2020) అమలులో భాగంగా మూడో భాష ను తప్పనిసరి అర్హతా సబ్జెక్టుగా ప్రకటించింది. ఇకపై 9, 10వ తరగతుల్లో చదివే విద్యార్థులు మూడో భాషలో నిర్వహించే అంతర్గత మూల్యాంకనంలో కూడా ఉత్తీర్ణత సాధించాలి. అలా సాధిస్తేనే వారికి సీబీఎస్ఈ టెన్త్ సర్టిఫికెట్ లభిస్తుంది.
సీబీఎస్ఈ విడుదల చేసిన తాజా మార్గదర్శకాల ప్రకారం, 2026 జూలై 1 నుంచి 9వ తరగతిలో చేరే విద్యార్థులకు మూడు భాషలు చదవడం తప్పనిసరి. వీటిలో కనీసం రెండు భారతీయ భాషలు ఉండాలి. ఒకవేళ విద్యార్థి విదేశీ భాషను ఎంచుకోవాలనుకుంటే, మిగిలిన రెండూ భారతీయ భాషలే కావాలి. తొమ్మిదో తరగతి విద్యార్థి థర్డ్ లాంగ్వేజ్ పరీక్షలో ఫెయిల్ అయినప్పటికీ పదో తరగతిలోకి అనుమతిస్తారు. అయితే పదో తరగతిలోనైనా ఆ పరీక్షలో తప్పనిసరిగా ఉత్తీర్ణత సాధించాలి.
ఇక, పదో తరగతిలో మూడో భాషకు బోర్డు పరీక్ష ఉండదు. దానికి బదులుగా పాఠశాలలే అంతర్గత మూల్యాంకనం నిర్వహిస్తాయి. వినడం, మాట్లాడడం, చదవడం, రాయడం వంటి భాషా నైపుణ్యాలతో పాటు ప్రాజెక్టులు, తరగతి గది కార్యకలాపాలు, నిరంతర మూల్యాంకనం ఆధారంగా మార్కులు కేటాయిస్తారు. ఈ మూల్యాంకనంలో విద్యార్థి ఉత్తీర్ణత సాధించడం తప్పనిసరి. విద్యార్థుల్లో మాతృభాషతో పాటు ఇతర భారతీయ భాషలపై పట్టు పెంచడం, బహుభాషా నైపుణ్యాలను అభివృద్ధి చేయడం దీని ప్రధాన ఉద్దేశమని సీబీఎస్ఈ పేర్కొంది (CBSE Language Rule).
కాగా, సీబీఎస్ఈ మూడు భాషల విధానాన్ని వ్యతిరేకిస్తూ సుప్రీంకోర్టులో పిటిషన్లు దాఖలయ్యాయి (Education News). అయితే ఈ విధానం అమలుపై మధ్యంతర స్టే ఇవ్వడానికి సుప్రీంకోర్టు ఇటీవల నిరాకరించింది. దీంతో ప్రస్తుత విద్యా సంవత్సరంలో కొత్త నిబంధనలు అమలు కానున్నాయి.










Comments