ఆత్మహుతి చేసుకుంటా: ఎమ్మెల్యే
హైదరాబాద్ : తాను ఎలాంటి కబ్జాలకు పాల్పడ లేదని.. తానేంటో ప్రజలకు తెలుసునని కూకట్‌పల్లి ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు స్పష్టం చేశారు. గురువారం హైదరాబాద్‌లో బీఆర్ఎస్ నేత, ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు మాట్లాడుతూ.. ఐడీపీఎల్ భూముల కబ్జాపై తనపై ఇద్దరు నేతలు అసత్య ప్రచారం చేయిస్తున్నారని మండిపడ్డారు. ఆ భూముల్లో నివాసం ఉంటున్న పేదల జోలికి వెళ్తే ఆత్మాహుతి చేసుకుంటానని ఆయన హెచ్చరించారు. సదరు భూముల్లో తాను గజం జాగా కబ్జా చేశానని నిరూపిస్తే.. తాను జైలుకెళ్లేందుకు సిద్దమని చెప్పారు.
రూ. 4 వేల కోట్ల విలువైన భూ వివాదంపై లోతుగా దర్యాప్తు చేయాలని ఈ సందర్భంగా ఏబీఎన్ ఆంధ్రజ్యోతిని కూకట్‌పల్లి ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు కోరారు. కొంత మంది రియల్ ఎస్టేట్ వ్యాపారులు కబ్జా పాల్పడుతున్నారని తాను గతంలోనే చాలా సార్లు ఫిర్యాదు చేశానని ఆయన గుర్తు చేశారు. అక్కడ స్థానికంగా ఉంటున్న ఇంద్రనగర్ 70 ఏళ్ల క్రితం ఏర్పడిందని తెలిపారు. అక్కడ నివసిస్తున్న ప్రజల కోసం డ్రైనేజీ, రహదారుల సౌకర్యం కల్పించాలంటూ జీహెచ్ఎంసీ నుంచి గతంలో నిధులు తీసుకొచ్చానని వివరించారు. అయితే ఐడిపిఎల్ ఉద్యోగులను తాను బెదిరించాననేది పూర్తిగా అవాస్తవమని ప్రకటించారు. ఈ ఆరోపణలను తాను పూర్తిగా ఖండిస్తున్నానని పేర్కొన్నారు.
ఇంతకీ ఏం జరిగిందంటే..?
తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత.. రాష్ట్రవ్యాప్తంగా జనం బాట పేరుతో పర్యటిస్తున్నారు. ఈ సందర్భంగా స్థానిక సమస్యలను ఆమె ప్రస్తావిస్తున్నారు. అలాగే తాజాగా కూకట్‌పల్లిలో ఆమె జనం బాట చేపట్టారు. ఈ సందర్భంగా స్థానిక సమస్యలను ఆమె ప్రస్తావించారు. అలాగే స్థానిక ఎమ్మెల్యే, బీఆర్ఎస్ నేత మాధవరం కృష్ణారావుపై కవిత వ్యాఖ్యలు చేశారు. ఈ వ్యాఖ్యలపై బుధవారం ప్రెస్ మీట్ పెట్టి ఎమ్మెల్యే కృష్ణారావు కాస్తా ఘాటుగా స్పందించారు.
దాంతో ఎమ్మెల్యే కృష్ణారావుపై జాగృతి నేతలతోపాటు అధ్యక్షురాలు కవిత మండిపడ్డారు. ఆధారాలతో సహా అన్ని విషయాలు బయటపెడతానంటూ కవిత స్పష్టం చేశారు.









Comments