స్టైపెండ్ 12శాతం పెంచలేం
అమరావతి : స్టైపెండ్ పెంచాలన్న డిమాండ్‌తో సమ్మెకు దిగిన జూనియర్ డాక్టర్లతో ప్రభుత్వ చర్చలు ఇంకా కొలిక్కి రాలేదు. ఇంటర్న్, పీజీలు, సూపర్ స్పెషాలిటీ వైద్యులతో కలిపి అందరికీ 12 శాతం స్టైపెండ్ ఇవ్వాలని జూడాలు డిమాండ్ చేశారు. జూనియర్ వైద్యుల అసోసియేషన్ ప్రతినిధులు సోమవారం సాయంత్రం మంగళగిరిలోని ఏపీఐఐసీలో మరోసారి ప్రభుత్వంతో చర్చలు జరిపారు. స్టైపెండ్‌ను ఏటా 7 శాతం పెంచాలని కోరారు. అయితే ప్రభుత్వం మాత్రం కేవలం ఇంటర్న్‌లకు మాత్రమే 10 శాతం పెంచడానికి దాదాపు ఆమోదించింది. పీజీలకు, సూపర్ స్పెషాలిటీ వైద్యులకు 3 శాతానికి మించి ఇవ్వలేమని తేల్చిచెప్పింది. ప్రభుత్వం తరఫున చర్చలకు వచ్చిన ఆరోగ్యశాఖ ఉన్నతాధికారులు ప్రభుత్వ పరిస్థితిని జూడాలకు వివరించారు. అయితే ప్రభుత్వ ప్రతిపాదనలపై సభ్యులతో చర్చించి నిర్ణయం తీసుకుంటామని తెలిపిన జూడాల ప్రతినిధులు చర్చల నుంచి బయటకు వచ్చేశారు. మంగళవారం మరోసారి ఇరువర్గాలూ చర్చించుకునే అవకాశం ఉంది.
కొనసాగుతున్న సమ్మె..
ఆంధ్రప్రదేశ్ జూనియర్ డాక్టర్స్ అసోసియేషన్ (ఆబ్జుడా) ఇచ్చిన పిలుపు మేరకు.. ఉపకార వేతనం పెంపు కోరుతూ జూనియర్ డాక్టర్లు చేస్తున్న నిరవధిక సమ్మె సోమవారానికి 14వ రోజుకు చేరింది. గుంటూరు జీజీహెచ్‌తో సహా రాష్ట్రవ్యాప్తంగా జూడాలు విధులు బహిష్కరించి సమ్మె కొనసాగిస్తున్నారు. సోమవారం వర్షంలో సైతం తమ నిరసన ప్రదర్శన కొనసాగించారు. ప్రభుత్వం మొండి పట్టు వీడి తమ న్యాయమైన డిమాండ్లను నెరవేర్చాలని కోరారు. ఇప్పటికీ ఆబ్జుడా ప్రభుత్వంతో అర్ధవంతమైన చర్చలకు కట్టుబడి ఉందని, తమ సమస్యకు ఆమోదయోగ్యమైన పరిష్కారం లభించే వరకు నిరవధిక సమ్మె కొనసాగిస్తామని జూనియర్ వైద్యుల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు డా. ఈశ్వర్ శంకర్ తెలిపారు.








Comments