• Aug 25, 2026
  • NPN Log

    శ్రీశైలం లెఫ్ట్‌ బ్యాంక్‌ కెనాల్‌ (ఎస్‌ఎల్‌బీసీ) టన్నెల్‌ తవ్వకంలో కీలక ముందడుగు పడింది. టన్నెల్‌ తవ్వకంలో ప్రమాదకరమైన షీర్‌ జోన్‌ను దాటేశారు. తీవ్రమైన ఒత్తిడి, పీడనం కారణంగా రాళ్లు కదిలిపోయి గుల్లగా మారిన బలహీన ప్రాంతమే షీర్‌ జోన్‌. గతంలో ఇక్కడే ప్రమాదం జరిగింది. అందుకే, బైపాస్‌ టన్నెల్‌ తవ్వుతున్నారు. ఇక్కడ కూడా 10-15 మీటర్లు షీర్‌ జోన్‌గా ఉంది. ఇప్పుడు దానిని విజయవంతంగా దాటేశారు. ఇప్పుడు ఇక టన్నెల్‌ తవ్వకం పనులు వేగంగా పూర్తవుతాయని అధికారులు అంచనా వేస్తున్నారు. నిజానికి, గతంలో షీర్‌ జోన్‌లో అపరిమితంగా సీపేజీ వచ్చిన విషయం తెలిసిందే. దానిని కట్టడి చేయడానికి గ్రౌటింగ్‌ చేశారు. ఆ నిర్ణయంతో ఉపరితలంలో భారీ రిజర్వాయర్‌ ఏర్పడి, టీబీఎం (టన్నెల్‌ బోరింగ్‌ మిషన్‌) ముందుకెళ్లగానే ఉపరితలం కూలిపోయి 8 మంది కార్మికులు దుర్మరణం పాలయ్యారు. దాంతో టీబీఎం తవ్వకం ఏ మాత్రం ప్రయోజనకరం కాదనే నిర్ణయానికి నిపుణులు వచ్చారు. ప్రమాదం జరిగిన ప్రాంతానికి 100 మీటర్ల ముందు నుంచే అలైన్‌మెంట్‌ మార్చారు. బైపాస్‌ టన్నెల్‌ తవ్వుకుంటూ ముందుకెళుతున్నారు. ఇక్కడ 10-15 మీటర్ల షీర్‌ జోన్‌ దాటడానికే దాదాపు నెల రోజులు పట్టిందని అధికారులు తెలిపారు. ప్రమాదానికి ఏమాత్రం అవకాశం ఇవ్వకుండా ముందుగానే రాతి పొరల్లోకి స్టీల్‌ పైపులను చొప్పించారు. గ్రౌటింగ్‌ ద్వారా పైకప్పు, పక్క భాగాలను బలోపేతం చేశారు. పూర్తి సురక్షితమని భావించిన తర్వాత.. చిన్న చిన్నగా తవ్వుకుంటూ షీర్‌ జోన్‌ను దాటేశారు. తవ్విన ప్రతి చిన్న భాగాన్ని వెంటనే రాక్‌ బోల్టులు, స్టీల్‌ గర్డర్లతో బలోపేతం చేస్తున్నారు. తద్వారా, రాళ్లు, మట్టి కూలిపోకుండా చర్యలు తీసుకుంటున్నారు. ఇన్‌లెట్‌ నుంచి బైపాస్‌ టన్నెల్‌ తవ్వకం 141 మీటర్లు పూర్తయింది. మరో 240 మీటర్ల తర్వాత ఔట్‌లెట్‌ వైపు అలైన్‌మెంట్‌లో కలవనుంది. ఒకప్పుడు ప్రాజెక్టు భవిష్యత్తుపైనే అనుమానాలు రేకెత్తించిన షీర్‌ జోన్‌ను సురక్షితంగా దాటడంతో ఇక భయం లేకుండా పనులు చేసే అవకాశం ఉందని అధికారులు భావిస్తున్నారు.

     

    ముందు మరో గండం..

    ప్రస్తుతం తవ్వకానికి టన్నెల్‌ బోరింగ్‌ మిషన్‌ (టీబీఎం) బదులుగా డ్రిల్లింగ్‌ బ్లాస్టింగ్‌ మెథడ్‌ (డీబీఎం)ను అనుసరిస్తున్నారు. 2025 ఫిబ్రవరిలో జరిగిన ప్రమాదంలో ఇన్‌లెట్‌లోని టీబీఎం పూర్తిగా దెబ్బతినగా.. ఔట్‌లెట్‌ వైపు ఉన్న టీబీఎంను కూడా పూర్తిగా తొలగించారు. డ్రిల్లింగ్‌ అండ్‌ బ్లాస్ట్‌ పద్ధతిని ఎంచుకొని ముందుకెళుతున్నారు. సొరంగం ముందుకు సాగుతున్న కొద్దీ టన్నెల్‌ ఉపరితలంలో ప్రవహించే నల్లవాగు కింద మరో బలహీన ప్రాంతం ఉండే అవకాశం ఉందని గుర్తించారు. అక్కడకు చేరుకున్నప్పుడు కూడా షీర్‌ జోన్‌ వద్ద తీసుకున్న జాగ్రత్తలే పాటించాలని అధికారులు నిర్ణయించారు.

    నాలుగు డేంజర్‌ జోన్‌లు

    ఎస్‌ఎల్‌బీసీ పథకంలో భాగంగా శ్రీశైలం రిజర్వాయర్‌ సమీపంలోని నాగర్‌కర్నూల్‌ జిల్లా బ్రహ్మగిరి (దోమలపెంట) నుంచి అచ్చంపేట మండలం మన్నెవారిపల్లి దాకా 43.930 కిలోమీటర్ల సొరంగం (టన్నెల్‌) తవ్వాలి. దీనిని రెండువైపుల నుంచి (ఇన్‌లెట్‌, ఔట్‌లెట్‌) తవ్వుతున్నారు. శ్రీశైలం రిజర్వాయర్‌లోని నీటిని తీసుకునే ప్రాంతం నుంచి చేపట్టిన ఇన్‌లెట్‌ టన్నెల్‌ను 13.936 కిలోమీటర్లు తవ్వినప్పుడు ప్రమాదం జరిగింది. అక్కడి నుంచి కాస్త వెనక్కి వెళ్లి టన్నెల్‌ మార్గాన్ని మార్చి ముందుకు వెళుతున్నారు. ప్రస్తుతం 13.750 కిలోమీటర్ల దాకా టన్నెల్‌ పూర్తయింది. ఔట్‌లెట్‌ వైపు 360 మీటర్ల మేర కొత్త విధానంలో తవ్వారు. ఇక్కడ మొత్తంగా 20.796 కి లో మీటర్లు తవ్వినట్లయింది. మిగిలిన 9 కిలోమీటర్ల పైచిలుకు మార్గంలో నాలుగు డేంజర్‌ జోన్లు ఉన్నాయని జాతీయ భూ భౌతిక పరిశోధన కేంద్రం (ఎన్‌జీఆర్‌ఐ) ఇటీవలే గుర్తించింది. అవి.. 15 కిలోమీటర్ల వద్ద ఒకటి, 17 కిలోమీటర్ల దగ్గర రెండోది, 19 నుంచి 20 కిలోమీటర్ల వద్ద రెండుచోట్ల కలిపి నాలుగు బలహీన ప్రాంతాలు ఉన్నాయని, వీటికి కూడా నల్లవాగే కారణమని తేల్చింది. దీనివల్ల టన్నెల్‌ తవ్వే దారిలో తేమ అధికంగా ఉందని, దీన్ని దాటడానికి సెన్సర్లు వినియోగిస్తూ ముందుకెళ్లాలని సూచించింది.

    ప్రతి నెల 350 మీటర్ల తవ్వకం

    సెప్టెంబరు తర్వాత ప్రతి నెల 350 మీటర్ల టన్నెల్‌ను తవ్వుతాం. డిసెంబరు-జనవరి తర్వాత ప్రతి నెల 425 మీటర్ల మేర తవ్వుతాం. కొత్తగా బూమర్లు (డ్రిల్లింగ్‌ చేసి, పేలుడు పదార్థాలు అమర్చేవి) తెప్పిస్తున్నాం. రెండు వైపులా, మూడు షిఫ్టుల్లో 400 మంది పనిచేస్తున్నారు. ప్రమాదకరమైన షీర్‌ జోన్‌ను దాటేశాం. బైపాస్‌ టన్నెలింగ్‌లో ప్రతి అడుగులో జాగ్రత్తగా టన్నెల్‌ తవ్వుతున్నాం. 2028 మేనాటికి ఇది పూర్తవుతుంది. ఇక, బీఎ్‌సఎన్‌ఎల్‌ 3జీ, 5జీ కనెక్షన్లతో కార్మికుల నుంచి నిరంతరం సమాచారం వచ్చేలా ఏర్పాట్లు చేశాం.

    You Might Also Like

    Comments

    Leave A Comment

    Don’t worry ! Your email address will not be published. Required fields are marked (*).

    Featured News

    Advertisement