• Sep 20, 2026
  • NPN Log

    పశ్చిమాసియాలో తాజాగా పెరుగుతున్న ఉద్రిక్తతల నేపథ్యంలో అమెరికా కీలక భద్రతా హెచ్చరిక జారీ చేసింది. ఈ ప్రాంతంలోని భద్రతా పరిస్థితి సంక్లిష్టంగా ఉందని, పరిస్థితులు చాలా త్వరగా మారిపోయే అవకాశం ఉందని అమెరికా విదేశాంగ శాఖ హెచ్చరించింది. అమెరికన్లు అప్రమత్తంగా ఉండాలని, ఈ ప్రాంతానికి వెళ్లే లేదా అక్కడి నుంచి ప్రయాణించే వారు విమాన సర్వీసులు, విమానాశ్రయాల తాజా సమాచారాన్ని గమనించాలని సూచించింది.

    పశ్చిమాసియా దేశాల్లో ఉన్న అమెరికన్లు అత్యంత అప్రమత్తంగా ఉండాలని ఆ దేశ విదేశాంగ శాఖ సూచించింది. విమానాల రద్దు, గగనతల మూసివేత, ఇతర ప్రయాణ అంతరాయాలు ఏర్పడే అవకాశం ఉందని హెచ్చరించింది. పశ్చిమాసియా వెలుపల ఉన్న అమెరికన్లు ఆ ప్రాంతానికి వెళ్లాలనుకున్నా లేదా ఈ ప్రాంతం మీదుగా ప్రయాణించాలనుకుంటున్నా పునరాలోచించాలని అమెరికా సూచించింది. సౌదీ అరేబియా రాజధాని రియాద్‌పై యెమెన్‌కు చెందిన హౌతీలు క్షిపణులు, డ్రోన్లతో దాడులు చేసినట్లు ప్రకటించిన నేపథ్యంలో అమెరికా తాజా హెచ్చరిక వెలువడింది.

    పశ్చిమాసియాలో కొనసాగుతున్న ఘర్షణల ప్రభావం అమెరికా పౌరులు, వ్యాపార సంస్థలు, దౌత్య కార్యాలయాలపై కూడా పడే అవకాశం ఉందని అమెరికా విదేశాంగ శాఖ పేర్కొంది. ఇరాన్‌ లేదా దానికి మద్దతు ఇచ్చే గ్రూపులు అమెరికా ప్రయోజనాలను లక్ష్యంగా చేసుకునే అవకాశం ఉందని హెచ్చరించింది. అందువల్ల అమెరికన్లు తమ పరిసరాలపై అప్రమత్తంగా ఉండాలని, స్థానిక అధికారుల సూచనలు పాటించాలని కోరింది.

    అమెరికా తాజాగా జారీ చేసిన హెచ్చరిక పశ్చిమాసియాలోని పలు దేశాలను కవర్ చేస్తోంది. బహ్రెయిన్‌, ఈజిప్ట్‌, ఇరాన్‌, ఇరాక్‌, ఇజ్రాయెల్‌, జోర్డాన్‌, కువైట్‌, లెబనాన్‌, ఒమన్‌, ఖతార్‌, సౌదీ అరేబియా, సిరియా, యూఏఈ, యెమెన్‌ తదితర ప్రాంతాల్లో ప్రయాణించే అమెరికన్లు తాజా భద్రతా సమాచారాన్ని గమనించాలని సూచించారు. సౌదీ అరేబియాకు సంబంధించి అమెరికా ప్రస్తుతం 'రీకన్సిడర్ ట్రావెల్' (ప్రయాణించే ముందు ఆలోచించండి) స్థాయి హెచ్చరికను కొనసాగిస్తోంది. యెమెన్‌కు మాత్రం 'డూ నాట్ ట్రావెల్' (ప్రయాణం వద్దు) స్థాయి హెచ్చరిక ఉంది.

    You Might Also Like

    Comments

    Leave A Comment

    Don’t worry ! Your email address will not be published. Required fields are marked (*).

    Featured News

    Advertisement