చిల్లర అడిగినందుకు ప్రయాణికుడిని చితక్కొట్టిన కండెక్టర్..
సాధారణంగా ఆర్టీసీ బస్సు లో చిల్లర విషయంలో కండెక్టర్ , ప్రయాణికుల మధ్య చిన్న చిన్న గొడవలు రావడం సహజం. రాజస్థాన్ లోని భరత్‌పూర్ లో దారుణ ఘటన వెలుగులోకి వచ్చింది. ఓ ప్రయాణికుడు తనకు రావాల్సిన బ్యాలెన్స్ డబ్బు గురించి కండెక్టర్ ని అడిగాడు. దాంతో అతడు కోపోద్రిక్తుడై ప్రయాణికుడిని చితకబాదాడు.. ఆ సయంలో పక్కనే ఉన్న డ్రైవర్ కూడా నవ్వుతూ కండెక్టర్ ని రెచ్చగొట్టినట్లు ప్రత్యక్ష సాక్షులు తెలిపారు. భరత్‌పూర్-ఆగ్రా మార్గంలో ఈ అమానవీయ ఘటన చోటు చేసుకుంది.
బాధిత ప్రయాణికుడు భరత్‌పూర్ నుంచి మధురకు వెళ్లేందుకు లోహఘర్ డిపోలో బస్సు ఎక్కాడు. మధురకు వెళ్లిందుకు రూ.500 ఇచ్చి కండెక్టర్ వద్ద టికెట్ తీసుకున్నాడు. టికెట్ చార్జీ 64 రూపాయలు. మిగిలిన డబ్బు తిరిగి ఇవ్వడానికి తగినంత చిల్లర లేకపోవడంతో తర్వాత ఇస్తానని చెప్పాడు కండెక్టర్. బస్సు మధుర-నరౌలి వంతెన వద్దకు చేరుకోగానే ప్రయాణికుడు కండెక్టర్ వద్దకు వెళ్లి తన బ్యాలెన్స్ డబ్బు తిరిగి ఇవ్వమని అడిగాడు..అప్పుడే వివాదం మొదలైంది. ఆ గొడవ పరస్పర దుషణకు దారితీసింది. అంతే ప్రయాణీకుడిని ఇంజన్ క్యాబిన్ పై పడేసి పిడిగుద్దులు గుద్దాడు కండెక్టర్. అది చూస్తూ డ్రైవర్ బస్సు ఆపకుండా నవ్వుతూ నడిపించాడు. తోటి ప్రయాణికులు ఎంత వారించినా కండెక్టర్ కొడుతూనే ఉన్నాడు. ప్రయాణికులు జోక్యం చేసుకొని డ్రైవర్ ని పక్కకు జరిపి ప్రయాణికుడిని రక్షించారు.
ఈ దృష్యాన్ని ఓ ప్రయాణికుడు వీడియో తీసి సోషల్ మీడియా(Social Media)లో పోస్ట్ చేయడంతో నెటిజన్లు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఆర్టీసీ బస్సుల్లో ప్రయాణం సురక్షితం అంటారు..ఇదేనా అది అంటూ ప్రశ్నిస్తున్నారు. ఈ ఘటనపై స్పందించిన లోహఘర్ డిపో చీఫ్ మేనేజర్ రాకేష్ కుమార్ మాట్లాడుతూ.. ఈ వీడియోలో ప్రయాణికుడిపై కండెక్టర్ దాడి చేసింది ధృవీకరించినట్లు తెలిపాడు. పోలీసులు కేసు నమోదు చేసుకొని విచారిస్తున్నట్లు తెలిపారు.









Comments