• Sep 22, 2026
  • NPN Log

    హైదరాబాద్‌ : ఎన్యుమరేషన్‌ ఫారాలు సమర్పించినా పలువురు ఓటర్ల పేర్లు ఓటర్‌ జాబితా ప్రత్యేక సవరణ (ఎస్‌ఐఆర్‌) ముసాయిదా జాబితాలో కనిపించడం లేదు. జీహెచ్‌ఎంసీ ఎన్నికల విభాగంలోని పలువురు ఉద్యోగుల కుటుంబసభ్యుల పేర్లూ జాబితా నుంచి మాయమయ్యాయి. పూర్తి సమాచారం ఫారాలు సమర్పించినా.. ఎందుకిలా జరిగిందని వారు ఆశ్చర్యపోయారు. సంబంధిత పోలింగ్‌ కేంద్రాల వివరాలు పరిశీలించగా ఫారాలు మొబైల్‌ యాప్‌లో ఎంట్రీ చేయలేదని తాజాగా గుర్తించారు. పూర్తి అవగాహనతో ఎన్నికల విభాగంలోని ఉద్యోగులు, వారి కుటుంబ సభ్యుల వివరాలు సమర్పిస్తేనే పరిస్థితి ఇలా ఉంటే.. ఇక సాధారణ పౌరుల విషయంలో ఏం జరిగిందో అర్ధం చేసుకోవచ్చు. ఈ నేపథ్యంలో ఎస్‌ఐఆర్‌ ముసాయిదా జాబితాపై విమర్శలు వ్యక్తమవుతున్నాయి.

     

    మేం ఇబ్బంది పడాలా?

    బూత్‌ లెవల్‌ ఆఫీసర్ల (బీఎల్‌ఓ) తప్పిదాల వల్ల తమ పేరు జాబితాలో లేకుండా పోయిందని వేలాది మంది జీహెచ్‌ఎంసీ సర్కిల్‌, జోనల్‌, కేంద్ర కార్యాలయాలతో పాటు విచారణ కేంద్రాలకు పరుగులు తీస్తున్నారు. అయినా ఇప్పుడు ఏం చేయలేని పరిస్థితి. ఓటర్‌గా పేరు నమోదుకు మళ్లీ దరఖాస్తు (ఫారం-6) చేసుకోవాలని అధికారులు సూచిస్తున్నారు. సిబ్బంది చేసిన పొరపాటుకు మేం ఇబ్బంది పడాలా? పనులు వదులుకొని తిరగాలా? అని ఓటర్లు మండి పడుతున్నారు.

    ఫారం సమర్పిస్తే.. పేరు ఉండాల్సిందే..

    ఎస్‌ఐఆర్‌లో భాగంగా ఇంటింటికి ఎన్యుమరేషన్‌ ఫారాలు పంపిణీ చేసి.. వాటిని పూరించిన అనంతరం సేకరించాల్సిన బాధ్యత బీఎల్‌ఓలది. పని భారంతో కొందరు.. ఉదాసీనతతో మరి కొందరు.. పూర్తిస్థాయిలో ఫారాలు పంపిణీ చేయలేదు. సేకరణ అంతంత మాత్రంగానే ఉంది. ఓటర్లు సమర్పించిన ఫారాలను కొందరు బీఎల్‌ఓలు యాప్‌లో అప్‌లోడ్‌ చేయలేదని గుర్తించారు. దీంతో ముసాయిదా జాబితాలో వారి పేరు కనుమరుగైంది. వాస్తవంగా ఫారం సమర్పించిన వారి పేరు ముసాయిదాలో కచ్చితంగా ఉండాలి. పూర్తి సమాచారం ఇస్తే పేరు ప్రచురించాల్సి ఉండగా.. అవసరమైన సమాచారం ఇవ్వని వారికి నోటీసులివ్వాలి. కానీ ఫారాలు ఇచ్చినా చాలా మంది పేర్లు ముసాయిదాలో లేకపోవడం గమనార్హం.

    2002 వివరాలు ఇచ్చినా..

    2002 ఓటరు జాబితాలో వివరాలు ఇచ్చినా.. కొందరికి నోటీసులు జారీ చేస్తున్నారు. ఓటర్లు ఇచ్చిన పూర్తి సమాచారం నమోదు చేయకపోడమే కారణంగా అధికారులు చెబుతున్నారు. హైదరాబాద్‌ జిల్లాలో 47.36 లక్షల ఓటర్లు ఉండగా.. 27.95 లక్షల ఓటర్లతో ముసాయిదా జాబితా ప్రకటించారు. 19.44 లక్షల ఓటర్ల పేర్లు జాబితా నుంచి గల్లంతయ్యాయి.

    ఇందులో ఫారాలు యాప్‌లో అప్‌లోడ్‌ చేయకపోవడం వారి సంఖ్య లక్షల్లోనే ఉంటుందని ఎన్నికల విభాగం వర్గాలు చెబుతున్నాయి. నోటీసులు జారీ చేసినా.. కొందరు ఓటర్లు విచారణకు హాజరయ్యేందుకు ఆసక్తి చూపడం లేదు. మూడు రకాల డాక్యుమెంట్లు సమర్పించాలని అధికారులు చెబుతుండడం.. అవన్నీ అందుబాటులో లేకపోవడంతో ఓటు హక్కు లేకున్నా సరే అన్న భావనలో కొందరు ఉండడం గమనార్హం.

    You Might Also Like

    Comments

    Leave A Comment

    Don’t worry ! Your email address will not be published. Required fields are marked (*).

    Featured News

    Advertisement