• Jun 25, 2026
  • NPN Log

    ఖమ్మం క్రైం : మద్యం, బెట్టింగ్‌కు బానిసైన భర్త తీరుతో తీవ్ర మనస్తాపం చెందిన భార్య.. ఇద్దరు పిల్లలకు ఎలుకల మందు తినిపించి.., తాను తీసుకుంది. ఇద్దరు పిల్లలు ప్రాణాలు కోల్పోగా, ఆమె పరిస్థితి విషమంగా ఉంది. ఖమ్మం జిల్లా కేంద్రంలో ఈ ఘటన జరిగింది. పోలీసులు వెల్లడించిన వివరాల ప్రకారం.. ఖమ్మం రూరల్‌ మండలం ఏదులాపురం మునిసిపాలిటీలోని గుర్రాలపాడు ప్రాంతానికి చెందిన బోబ్బాల లింగరాజుకు చింతకాని మండలం నరసింహపురం గ్రామానికి చెందిన దొడ్డా పూర్ణయ్య కుమార్తె స్వాతితో 2020లో వివాహం జరిగింది. వీరికి కుమారులు వేదిక్‌ కుమార్‌ (5), తనీశ్‌ కుమార్‌(4) ఉన్నారు. లింగరాజు భార్యతో కలిసి గుర్రాలపాడులోనే ఉంటూ ఖమ్మంలోని ఓ సెల్‌పాయింట్‌లో పని చేస్తున్నాడు. ఏడాది క్రితం భార్యాపిల్లలతో ఖమ్మంలోని గాంధీనగర్‌లోని ఓ అద్దె ఇంటికి మారాడు. ఈ క్రమంలో లింగరాజు మద్యానికి బానిసయ్యాడు. ఆన్‌లైన్‌ బెట్టింగ్‌లకూ అలవాటు పడి రూ.లక్షల్లో పొగొట్టుకున్నాడు. గమనించిన మామ పూర్ణయ్య ఇటీవలే లింగరాజుకు ఽఇకనైనా దురలవాట్లు మానుకోవాలని చెప్పి రూ.1.5 లక్షలు ఇచ్చాడు. ఆ డబ్బులనూ లింగరాజు బెట్‌ కాసి పోగొట్టుకున్నాడు. ఇలా బెట్టింగ్‌లో మొత్తంగా రూ. 4లక్షల దాకా పోగొట్టుకున్నాడు. ఈ విషయం ఇరు కుటుంబాలకు తెలియడంతో వారు భార్యాభర్తలను కూర్చోబెట్టి సోంతూరుకు వెళ్ళి ఏదైనా పనిచేసుకొవాలని సూచించారు. దీంతో లింగరాజు గుర్రాలపాడుకు వెళ్లి ఏదైనా చేసుకోవాలని నిర్ణయం తీసుకున్నాడు. శనివారం ఉదయం ఖమ్మంలోని అద్దె ఇంట్లోని సామాను సర్దుకునేందుకు ఏర్పాట్లు కూడా చేసుకున్నాడు. తీవ్ర ఆర్థిక సమస్యల కారణంగా ఖమ్మం వదిలి, గ్రామానికి వెళ్లడం స్వాతికి నచ్చలేదు. ఈ విషయమై ఇద్దరి మధ్య రెండు రోజుల క్రితం పెద్ద ఎత్తున గొడవ కూడా జరిగింది. స్వాతి తండ్రి శనివారం ఖమ్మానికి వచ్చి సొంతూరుకే వెళ్లాలని ఆమెకు నచ్చజెప్పి వెళ్లాడు. ఆ తర్వాత కొద్దిసేపటికే ఇంట్లో ఎవరూ లేని సమయంలో స్వాతి తన ఇద్దరు పిల్లలకు బిస్కెట్లలో ఎలుకల మందు పెట్టి తినిపించింది. ఆ తర్వాత తాను కూడా తిన్నది. 

    కొద్దిసేపటికి భర్త లింగరాజుకు ఫోన్‌ చేసి పిల్లలకు ఫుడ్‌పాయిజన్‌ అయిందని, వాంతులు అవుతున్నాయని.. వెంటనే మందులు తీసుకు రావాలని చెప్పింది. లింగరాజు ఓ మెడికల్‌ షాపులో సిరప్‌ తీసుకుని ఇంటికి వెళ్లి ఇచ్చాడు. ఆదివారం తెల్లవారుజామున పెద్ద కుమారుడు వేదిక్‌ కుమార్‌ తీవ్ర అస్వస్థతకు గురవడంతో చికిత్స నిమిత్తం నగరంలోని ఓ ఆస్పత్రికి తరలించారు. అప్పటికే తనీశ్‌కు కూడా వాంతులు కావడంతో.. అతన్ని కూడా ఆస్పత్రిలో చేర్పించారు. అనుమానం వచ్చిన భర్త, అతడి కుటుంబ సభ్యులు అసలు ఏం జరిగిందని స్వాతిని నిలదీశారు. దీంతో ఇద్దరు పిల్లలకు బిస్కెట్‌లలో ఎలుకల మందు తినిపించి, తాను కూడా తిన్నట్టు తెలిపింది. వెంటనే ఆమెను కూడా భర్త ఓ ప్రయివేటు ఆస్పత్రికి తరలించాడు. వేదిక్‌, తనీశ్‌ ఇద్దరూ చికిత్స పొందుతూ మృతిచెందారు. స్వాతి పరిస్థితి విషమంగా ఉన్నట్టు తెలిసింది. భర్త బెట్టింగ్‌లకు అలవాటు పడి, ఆర్థికంగా తీవ్ర నష్టపోవడం వల్లే స్వాతి ఈ దుశ్చర్యకు పాల్పడినట్టు తెలుస్తోంది. కాగా.. బెట్టింగులకు అలవాటుపడి లింగరాజు వేధిస్తుండటం వల్లే మనస్థాపం చెంది తన కూతురు స్వాతి ఈ ఘటనకు పాల్పడిందని ఆమె తండ్రి పూర్ణయ్య పోలీసులకు ఫిర్యాదు చేశాడు. ఖమ్మం పోలీసులు ఘటనపై కేసు నమోదు చేశారు.

    You Might Also Like

    Comments

    Leave A Comment

    Don’t worry ! Your email address will not be published. Required fields are marked (*).

    Featured News

    Advertisement