విద్యార్థులపై పాక్ ఆర్మీ అధికారి దౌర్జన్యం.. ఏకంగా తుపాకీతో కాల్పులు..
ఇస్లామాబాద్: పాకిస్థాన్‌లో విద్యార్థులపై ఓ ఆర్మీ అధికారి కాల్పులు జరపడం తీవ్ర విమర్శలకు దారి తీసింది. ఫీజులు, తరగతుల షెడ్యూల్‌పై విద్యార్థులు శాంతియుతంగా నిరసన చేపట్టగా.. వారిపై పాక్ ఆర్మీ అధికారి దౌర్జన్యానికి దిగారు. విద్యార్థులపై దాడి చేసి అనంతరం గాల్లోకి కాల్పులు జరిపారు. ఈ ఘటన ఇస్లామాబాద్‌లోని సర్హద్ యూనివర్సిటీ రవత్ క్యాంపస్‌లో సోమవారం జరిగింది.
ఫీజులు, తరగతుల షెడ్యూల్ విషయంలో విద్యార్థులు తమ హెచ్ఓడీకి వ్యతిరేకంగా క్యాంపస్‌లో నిరసన చేపట్టారు. వారిని శాంతింపజేసేందుకు యూనివర్సిటీ హెడ్ ఆఫ్ స్టూడెంట్ అఫైర్స్ డాక్టర్ ఐనా అక్కడికి వచ్చారు. కొంతమంది విద్యార్థులు ఆందోళన విరమించేందుకు నిరాకరించడంతో ఆమె తన భర్త అయిన ఆర్మీ అధికారికి ఫోన్ చేశారు. యూనిఫాంలో క్యాంపస్‌కు చేరుకున్న అధికారి.. తొలుత విద్యార్థులపై కర్రతో దాడికి దిగారు. దీనిని పలువురు విద్యార్థులు గట్టిగా ప్రశ్నించారు.
ప్రశ్నించిన విద్యార్థులపైనా ఆ అధికారి చేయి చేసుకున్నారు. దీంతో యువకులంతా అతనిపై దాడి చేశారు. ఇక తన సర్వీస్ తుపాకీని బయటకు తీసిన అధికారి తొలుత విద్యార్థులపై గురిపెట్టాడు. అనంతరం పలు రౌండ్లు గాల్లోకి కాల్పులు జరిపాడు. దీంతో అక్కడి నుంచి విద్యార్థులు కొంత దూరం పరిగెత్తారు. కాగా, కాల్పులు జరిపిన అధికారికి కల్నల్ లేదా బ్రిగేడియర్ స్థాయి ఉంటుందని తెలుస్తోంది. ఈ ఘటనకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సామాజిక మాధ్యమాల్లో వైరల్‌గా మారింది.
మరోవైపు, ఆర్మీ అధికారి గాల్లోకి కాల్పులు జరిపిన వీడియో వైరల్ కావడంతో పాకిస్థాన్ ఆర్మీ స్పందించింది. సదరు అధికారిపై క్రమశిక్షణ చర్యలు ప్రారంభించడంతో పాటు అంతర్గత విచారణకు ఆదేశించినట్లు సంబంధిత వర్గాలు తెలిపాయి. కాగా, ఇప్పటికే పాకిస్థాన్‌లోని బలూచిస్థాన్, ఖైబర్ పఖ్తున్ఖ్వా, పాక్ ఆక్రమిత జమ్మూకశ్మీర్ ప్రాంతాల్లో ఆర్మీపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ప్రజలపై దౌర్జన్యాలకు పాక్ సైన్యమే కారణమని పలువురు ఆరోపిస్తున్నారు.









Comments