• Jul 27, 2026
  • NPN Log

    అమరావతి : టీచర్లు సర్దుబాటు ప్రక్రియ గందరగోళంగా మారింది. పాఠశాల విద్యాశాఖ ప్రకటించిన షెడ్యూల్‌ ప్రకారం జరగకపోవడంతో ప్రక్రియ ఇంకా కొనసా..గుతూనే ఉంది.. సర్దుబాటుపై సర్వీసుల విభాగం ఆది నుంచీ నిర్లక్ష్య ధోరణితో ఉండడమే ఇందుకు కారణంగా విమర్శలు వినిపిస్తున్నాయి. రాష్ట్రంలో ప్రస్తుతం పనిచేస్తున్న పాఠశాలల్లో 7129 మంది టీచర్లు మిగులుగా ఉన్నట్లు పాఠశాల విద్యాశాఖ తేల్చింది. ఇందులో సెకండరీ గ్రేడ్‌ టీచర్లు 4140 మంది, స్కూల్‌ అసిస్టెంట్లు 2989 మంది ఉన్నారు. వీరిని అవసరమున్న పాఠశాలలకు సర్దుబాటు చేయాల్సి ఉంది. తొలుత ప్రకటించిన షెడ్యూలను రద్దుచేసి మళ్లీ కొత్త షెడ్యూలు ప్రకటించినా అదీ సక్రమంగా అమలుకావడం లేదు. కొత్త షెడ్యూలు ప్రకారం 4వ తేదీనే ఎంఈవో స్థాయిలో మండల స్థాయి కౌన్సెలింగ్‌ పూర్తికావాలి. అప్పటికీ మిగిలిన టీచర్లకు డివిజన్‌ స్థాయిలో డిప్యూటీ ఎడ్యుకేషనల్‌ ఆఫీసర్‌ మంగళవారం(నేడు) కౌన్సెలింగ్‌ నిర్వహించాలి. కానీ మండల స్థాయి కౌన్సెలింగ్‌ సోమవారం సాయంత్రానికి కూడా చాలా జిల్లాల్లో ప్రారంభం కాలేదు. శనివారం, ఆదివారం కౌన్సెలింగ్‌ చేస్తారని టీచర్లు ఎదురుచూశారు. సోమవారం ఉదయం నుంచి కౌన్సెలింగ్‌ కోసం ఎదురుచూడగా సాయంత్రానికి కూడా ప్రక్రియ ప్రారంభం కాలేదు. మరోవైపు పాఠశాల విద్య సర్వీసుల విభాగం నుంచి కూడా ఎలాంటి స్పందన లేదు. తొలినుంచీ నిర్లక్ష్య ధోరణే ప్రదర్శిస్తోంది. గతంలో సర్దుబాటు ప్రక్రియ తేదీలు టీచర్లకు తెలిసేలా ప్రకటనలు జారీచేసేవారు. కానీ ఈసారి సర్దుబాటు ప్రక్రియను అధికారులు రహస్యంగా మార్చేశారు. తొలుత ప్రకటించిన షెడ్యూలుగానీ, సవరించిన షెడ్యూలుపైనా ఎలాంటి అధికారిక ప్రకటనలు జారీచేయలేదు. దీంతో టీచర్లకు సరైన సమాచారం లేక గందరగోళానికి గురయ్యారు. షెడ్యూలు ప్రకారం ఈనెల 9తో మొత్తం సర్దుబాటు ప్రక్రియ పూర్తికావాలి. కానీ ఇప్పటికీ ఎంఈవో స్థాయిలోనే కౌన్సెలింగ్‌ పూర్తిస్థాయిలో చేపట్టకపోవడంతో షెడ్యూలు ప్రకారం సర్దుబాటు పూర్తయ్యే అవకాశం కనిపించడం లేదు. కాగా రాష్ట్రంలో స్కూల్‌ అసిస్టెంట్లు గణితం- 602 మంది, ఇంగ్లీష్‌- 450 మంది, ఫిజికల్‌ సైన్స్‌ 372 మంది, బయలాజికల్‌ సైన్స్‌ 235 మంది, సోషల్‌ స్టడీస్‌ 343 మంది మిగులుగా ఉన్నారు.

     

     

    You Might Also Like

    Comments

    Leave A Comment

    Don’t worry ! Your email address will not be published. Required fields are marked (*).

    Featured News

    Advertisement