• Jun 05, 2026
  • NPN Log

    విశాఖపట్నం : తీవ్రమైన వడగాడ్పులు, ఠారెత్తించే ఎండలతో ఉడుకుతున్న దేశ ప్రజలకు, ముఖ్యంగా కోట్లాది మంది రైతులకు భారత వాతావరణ శాఖ చల్లని కబురు చెప్పింది. ఖరీఫ్‌ సీజన్‌లో పంటల సాగుకు తద్వారా ఆర్థిక వ్యవస్థకు వెన్నుదన్నుగా ఉండే నైరుతి రుతుపవనాలు గురువారం కేరళను తాకాయి. కేరళ, లక్షద్వీప్‌ మొత్తం, కర్ణాటక, తమిళనాడుల్లోని కొన్ని భాగాలు, కొమోరిన్‌ ప్రాంతం, అరేబియా సముద్రం, బంగాళాఖాతంలో పలు ప్రాంతాలకు రుతుపవనాలు విస్తరించాయి. ఈ మేరకు వాతావరణ శాఖ గురువారం ప్రకటన చేసింది. సాధారణంగా జూన్‌ 1వ తేదీకి కేరళలో రుతుపవనాలు ప్రవేశించాలి. ఈ ఏడాది మూడు రోజులు ఆలస్యంగా కేరళను తాకినట్టు ఐఎండీ పేర్కొంది. గత రెండు రోజుల నుంచి కేరళలో విస్తారంగా వర్షాలు కురుస్తుండడం, అరేబియా సముద్రం మీదుగా సముద్ర మట్టానికి 4.5 కిలోమీటర్ల ఎత్తులో సుమారు 50 కిలోమీటర్ల వేగంతో పడమర గాలులు వీస్తుండడంతో కేరళను నైరుతి రుతుపవనాలు తాకాయని ప్రకటించింది. రానున్న 2-3 రోజుల్లో తమిళనాడులో మిగిలిన ప్రాంతాలు, గోవా మొత్తం, కర్ణాటక, మహారాష్ట్ర, ఆంధ్రప్రదేశ్‌లో పలు ప్రాంతాలకు, అరేబియా సముద్రం, బంగాళాఖాతంలో మరికొన్ని భాగాలకు, ఈశాన్య రాష్ట్రాల్లో కొంత భాగానికి రుతుపవనాలు విస్తరించేందుకు వాతావరణం అనుకూలంగా ఉందని పేర్కొంది.

     

    ఈసారి 90 శాతం వానలే..

    గతంతో పోలిస్తే, ఈసారి నైరుతి రుతుపవనాలు కేరళలోకి ఆలస్యంగా ప్రవేశించాయి. అండమాన్‌ నికోబార్‌ దీవులకు మే 16న రుతుపవనాలు వచ్చాయి. దీంతో మే 26నే కేరళను తాకుతాయని ఐఎండీ ముందుగా అంచనా వేసింది. కానీ, ఎల్‌నినో పరిస్థితుల కారణంగా ఆ అంచనాలు తప్పాయి. అరేబియా సముద్రంలో ఉపరితల ఆవర్తనం ఆవరించడం, హిందూ మహాసముద్రంలో తేమ మేఘాలు క్రమేపీ బలపడడంతో జూన్‌ 4న కేరళను తాకుతాయని ఐఎండీ నాలుగు రోజుల క్రితం ప్రకటించింది. ఇదిలా ఉండగా, ఈ సారి నైరుతి రుతుపవనాల సీజన్‌ (జూన్‌-సెప్టెంబరు)లో సాధారణం కంటే తక్కువ వర్షపాతం నమోదవుతుందని వాతావరణ శాఖ ఇప్పటికే వెల్లడించిన విషయం తెలిసిందే. దీర్ఘకాల సగటు (ఎల్‌పీఏ-87 సెంటీమీటర్లు)తో పోలిస్తే దాదాపు 90 శాతం వానలే పడుతాయని అంచనా వేసింది. కొద్ది ప్రాంతాలు తప్ప పశ్చిమాన మహారాష్ట్ర, గుజరాత్‌ నుంచి తూర్పున ఒడిశా వరకు వర్షాభావం నెలకొంటుందని పేర్కొంది. కాగా, సాధారణం కంటే తక్కువ వర్షపాతం అంచనాల వెనుక ప్రధాన కారణం.. ఎల్‌నినో పరిస్థితుల ఆవిర్భావం. ప్రస్తుతం భూమధ్యరేఖ పసిఫిక్‌ ప్రాంతంలోని తటస్థ ఎల్‌నినో సదరన్‌ ఆసిలేషన్‌ పరిస్థితులు ఎల్‌నినో పరిస్థితుల వైపు మారుతున్నాయి. ఎల్‌నినో పరిస్థితులు జూన్‌లో కొంత బలహీనంగా ఉన్నప్పటికీ.. సెప్టెంబరులో మధ్యస్థం నుంచి బలంగా ఉంటాయని ఐఎండీ వెల్లడించింది. ఒకవేళ ఈ సీజన్‌లో వర్షపాతం ఎల్‌పీఏలో 90 శాతానికి కంటే తక్కువగా నమోదైతే, ఐఎండీ దానిని ‘లోటు’గా వర్గీకరిస్తుంది.

    రాష్టంలో మిశ్రమ వర్ష ప్రభావం

    గురువారం కేరళలో ప్రవేశించిన రుతుపవనాలు రానున్న 2-3 రోజుల్లో ఏపీలోని పలు ప్రాంతాలకు విస్తరించనున్నాయి. తమిళనాడు, కర్ణాటకకు ఆనుకుని రాయలసీమ, దక్షిణ కోస్తాల్లో కొన్ని ప్రాంతాలకు రుతుపవనాలు విస్తరించే అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు. రాష్ట్రంలో మిగిలిన ప్రాంతాలకు రుతుపవనాల విస్తరణకు కొంత సమయం పడుతుందని వాతావరణ నిపుణులు పేర్కొంటున్నారు. వాతావరణ శాఖ గత వారం ఇచ్చిన నివేదిక మేరకు.. నాలుగు నెలల రుతుపవనాల సీజన్‌లో ఉత్తర కోస్తాలో శ్రీకాకుళం, పార్వతీపురం మన్యం, విజయనగరం, విశాఖపట్నం, అనకాపల్లి, కాకినాడ, తూర్పుగోదావరి, కోనసీమ మొత్తం, అల్లూరి సీతారామరాజు జిల్లాలో ఎక్కువ భాగాల్లో సాధారణ వర్షపాతం నమోదవుతుంది. ఇంకా ఎన్టీఆర్‌, కృష్ణా, గుంటూరు, బాపట్ల, పల్నాడు, ప్రకాశం జిల్లాలు, నెల్లూరులో సగం ప్రాంతంలో సాధారణం కంటే ఎక్కువగా, అన్నమయ్య, చిత్తూరు, తిరుపతి జిల్లాల్లో సాధారణంగా వర్షాలు కురుస్తాయి. ఏలూరు, పశ్చిమగోదావరి, పోలవరం, కర్నూలు, నంద్యాల, శ్రీసత్యసాయి, కడప జిల్లాల్లో సాధారణ కంటే తక్కువగా, అనంతపురం జిల్లాలో సగభాగంలో సాధారణం కంటే తక్కువ, మిగిలిన భాగంలో సాధారణ వర్షపాతం నమోదవతుందని అంచనా.

    You Might Also Like

    Comments

    Leave A Comment

    Don’t worry ! Your email address will not be published. Required fields are marked (*).

    Featured News

    Advertisement