డేటా సెంటర్లలో ప్రపంచంలోనే ఏపీ టాప్
అమరావతి : అంతర్జాతీయంగా డేటా సెంటర్ల సామర్థ్యంలో ఏపీ టాప్‌గా నిలవనుంది. ప్రస్తుతం వర్జీనియాలోని 1.3 గిగావాట్ సామర్థ్యంతో కూడిన డేటా సెంటర్ మాత్రమే టాప్-1లో ఉంది. కానీ.. ఇప్పుడు విశాఖలో టీసీఎస్ రెండు గిగావాట్లు.. గూగుల్ అనుబంధ సంస్థ రైడెన్ ఇన్ఫో ఒక గిగావాట్.. సిఫీ 450 మెగావాట్ల సామర్థ్యంతో డేటా సెంటర్లు ఏర్పాటు చేయనున్నాయి. దీంతో విశాఖలో ఏకంగా మూడున్నర గిగావాట్ల డేటా సెంటర్ల సామర్థ్యంతో రాష్ట్రం అంతర్జాతీయంగా నంబర్ వన్‌గా నిలువనున్నదని ఐటీ శాఖ చెబుతోంది. ఈ డేటా సెంటర్ల ద్వారా రానున్న ఐదేళ్లలో లక్షన్నర మందికి ఉద్యోగావకాశాలు లభించనున్నాయి. ఈ నెల 14వ తేదీన ఢిల్లీలో కేంద్ర ఐటీ, కమ్యూనికేషన్ల శాఖ మంత్రి అశ్వనీ వైష్ణవ్, ముఖ్యమంత్రి చంద్రబాబు, రాష్ట్ర ఐటీ శాఖ మంత్రి లోకేశ్ సమక్షంలో కీలక ప్రకటన చేయనున్నారు. గూగుల్ ప్రతినిధులు, గూగుల్ అనుబంధ సంస్థ రైడెన్ ఇన్ఫో ప్రతినిధులు విశాఖలో గిగావాట్ సామర్థ్యంతో నెలకొల్పబోయే డేటా సెంటర్‌పై అధికారికంగా ప్రకటన చేయనున్నారు. ఈ సంస్థ రూ.87,520 కోట్లతో విశాఖ సమీపంలోని అచ్యుతాపురం, అడవివరం, తుర్లవాడల్లో 500 ఎకరాల్లో మూడు దశల్లో డేటా సెంటర్లను ఏర్పాటు చేయనున్నది. రైడెన్ ఇన్ఫో పెట్టుబడులపై శుక్రవారం రాష్ట్ర మంత్రి మండలి ఆమోదం తెలుపనున్నది. కాగా, ఈ నెల 11వ తేదీన విశాఖలో సిఫీ 450 మెగావాట్ల డేటా సెంటర్, కేబుల్ ల్యాండింగ్ స్థాపనకు భూమి పూజ జరగనున్నది. టీసీఎస్ ప్రతినిధులు గురువారం వెలగపూడి సచివాలయంలో సీఎం చంద్రబాబును కలసి విశాఖలో రెండు గిగావాట్ సామర్థ్యంతో డేటా సెంటర్‌ను స్థాపిస్తామని తెలిపారు. ఈ నిర్ణయాన్ని ముఖ్యమంత్రి ఆహ్వానించారు.
Comments