ఆ అనుభవం మాకు కావాలి.. రోహిత్ పై గిల్ కామెంట్స్
టీమిండియా స్టార్ ప్లేయర్, మాజీ కెప్టెన్ రోహిత్ శర్మపై యంగ్ ప్లేయర్, వన్డే కొత్త కెప్టెన్ శుభ్‌మన్ గిల్ ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశాడు. భారత క్రికెట్ జట్టు డ్రెస్సింగ్ రూమ్‌లో రోహిత్ శర్మ ఫ్రెండ్లీ వాతావరణం సృష్టించాడని.. తానూ అదే కొనసాగిస్తానని ఎంపికైన శుభ్‌మన్ గిల్ వ్యాఖ్యానించాడు. శుక్రవారం వెస్టిండీస్‌తో రెండో టెస్టు నేపథ్యంలో గిల్ మీడియా సమావేశంలో పాల్గొన్నాడు.
గిల్ మాట్లాడుతూ..‘రోహిత్ శర్మ చాలా ప్రశాంతంగా ఉంటాడు. అతడు కెప్టెన్ గా ఉంటూ జట్టులో నెలకొల్పిన స్నేహపూరిత వాతావరణాన్ని కెప్టెన్ గా నేనూ కొనసాగిస్తాను. చాలామంది బయట నుంచి అనేక రకాల కామెంట్స్ చేస్తున్నారు. అయితే రోహిత్, విరాట్ ప్రస్తుతం వన్డేల్లోనే కొనసాగుతున్నారు. వారిద్దరి భవితవ్యంపై ఊహాగానాలు వస్తున్నాయి. వీరిద్దరూ అద్భుతమైన నైపుణ్యం కలిగిన క్రికెటర్లు. వీరు అనేక మ్యాచుల్లో భారత్ ను గెలిపించారు. జట్టుకు వారు చాలా అవసరం. వచ్చే వన్డే ప్రపంచ కప్ లక్ష్యంగా వారి సన్నద్ధత జరుగుతోంది’’ అని గిల్ వెల్లడించారు.
ఎలాంటి సవాళ్లనైనా ఎదుర్కొనేందుకు తాను సిద్ధంగా ఉన్నానని గిల్ తెలిపాడు. భవిష్యత్తులో ఏం జరుగుతుందో చెప్పలేమని, తాను కూడా ఉత్సాహంగా ఎదురు చూస్తున్నామని వ్యాఖ్యానించాడు. అయితే, తానెప్పుడూ వర్తమానంలో ఉండేందుకే ఇష్టపడతానని, అలాగే గతంలో ఏం సాధించాననేది అప్రస్తుతమని అన్నాడు. ప్రతి మ్యాచ్‌లోనూ విజయం సాధించాలనే లక్ష్యంతోనే ముందుకుసాగుతామని, రాబోయే కొన్ని నెలలు మాకు చాలా ముఖ్యమని గిల్ తెలిపాడు.
Comments