తగ్గిన వడ్డీ రేట్లు.. కొనసాగిన లాభాలు..
ఊహించినట్టుగానే యూఎస్ ఫెడ్ రిజర్వ్ వడ్డీ రేట్లలో కోత విధించడం దేశీయ సూచీలకు బూస్టింగ్ ఇచ్చింది. అలాగే భారత్, అమెరికా మధ్య వాణిజ్య చర్చలు జరుగుతున్నాయనే వార్తలు మదుపర్లలో ఆత్మవిశ్వాసాన్ని నింపాయి. దీంతో మంగళ, బుధవారాలు భారీ లాభాలను ఆర్జించిన దేశీయ సూచీలు గురువారం కూడా అదే జోరును కొనసాగించాయి. ఈ నేపథ్యంలో గురువారం సెన్సెక్స్, నిఫ్టీ భారీ లాభాలను ఆర్జించాయి.
బుధవారం ముగింపు (82, 693)తో పోల్చుకుంటే గురువారం ఉదయం దాదాపు 400 పాయింట్లకు పైగా లాభంతో మొదలైన సెన్సెక్స్ రోజుంతా లాభాల్లోనే కదలాడింది. గురువారం సెన్సెక్స్ 82, 704 - 83, 141 శ్రేణి మధ్యలో కదలాడింది. చివరకు సెన్సెక్స్ 320 పాయింట్ల లాభంతో 83, 013 వద్ద రోజును ముగించింది. చాలా రోజుల తర్వాత సెన్సెక్స్ 83 వేల మార్క్‌కు పైన స్థిరపడింది. మరో వైపు నిఫ్టీ కూడా సెన్సెక్స్ బాటలోనే కదలాడింది. చివరకు 93 పాయింట్ల లాభంతో 25, 423 వద్ద స్థిరపడింది.
సెన్సెక్స్‌లో ఎల్‌ఐసీ హౌసింగ్ ఫైనాన్స్, హెచ్‌ఎఫ్‌సీఎల్, బయోకాన్, లారస్ ల్యాబ్స్, గ్లెన్‌మార్క్ షేర్లు లాభాలను ఆర్జించాయి. పేజ్ ఇండస్ట్రీస్, కోల్ ఇండియా, టాటా కెమికల్స్, కల్యాణ్ జువెల్లర్స్, ప్రెస్టీజ్ ఎస్టేట్ షేర్లు నష్టాల బాటలో నడిచాయి. నిఫ్టీ మిడ్ క్యాప్ ఇండెక్స్ 224 పాయింట్లు లాభపడింది. బ్యాంక్ నిఫ్టీ 234 పాయింట్లు ఎగబాకింది. డాలర్‌తో పోల్చుకుంటే రూపాయి మారకం విలువ 88.13గా ఉంది.
Comments