కర్ణాటకను వీడి విశాఖకు మిట్టల్
బళ్లారి : స్టీల్ తయారీ, ఐరన్ ఓర్ తవ్వకాల్లో దిగ్గజ సంస్థ మిట్టల్ కంపెనీ కర్ణాటకను వీడి విశాఖకు వస్తున్నట్టు ప్రకటించింది. కర్ణాటక ప్రభుత్వం ఏమాత్రం తమకు ప్రాధాన్యం ఇవ్వడం లేదని, ఇదేసమయంలో ఏపీలోని కూటమి ప్రభుత్వం పెట్టుబడిదారులకు రెడ్ కార్పెట్ పరుస్తున్న నేపథ్యంలో రాష్ట్రాన్ని వీడాలని నిర్ణయించుకున్నట్టు పేర్కొంది. వాస్తవానికి కర్ణాటకలోని బళ్లారి జిల్లాలో ఉన్న కుడితిని సమీపంలో పరిశ్రమల స్థాపనకు గత ప్రభుత్వం 2010లో 12,500 ఎకరాల భూమిని రిజర్వు చేసింది. బీఎస్ యడియూరప్ప ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో కేఐఏడీబీ ద్వారా ఈ భూములను సేకరించి, పరిశ్రమలకు కేటాయించారు. దీనిలో మిట్టల్ కంపెనీ 2,643 ఎకరాలను కొనుగోలు చేసింది. కుడితిని, వేణివీరాపురం, హరగినధోని, కొలగల్లు, రారంగవి, జానకుంట, సిద్దమనహళ్లి తదితర గ్రామాల పరిధిలో ఈ భూములు ఉన్నాయి. సేకరించిన 12,500 ఎకరాలలో 4,800 ఎకరాలను ఉత్తమ్ గాల్వా, 2,850 ఎకరాలను ఎన్‌ఎండీసీ, 2,643 ఎకరాలను మిట్టల్ కంపెనీకి కేటాయించారు. ఆ తర్వాత ఇక్కడ పరిశ్రమల స్థాపనకు ప్రభుత్వం నుంచి తగిన ప్రోత్సాహం లభించలేదు. ఫలితంగా ఆయా భూముల్లో ఇంత వరకూ ఒక్క పరిశ్రమ కూడా ఏర్పాటు కాలేదు. ఈ నేపథ్యంలో బళ్లారి జిల్లా కుడితిని వద్ద స్టీల్ ఫ్యాక్టరీ నెలకొల్పాలనే ఆలోచనను మిట్టల్ కంపెనీ విరమించుకుంది. ఇదేసమయంలో ఏపీలోని కూటమి ప్రభుత్వం పారిశ్రామిక వేత్తలకు ఇస్తున్న ప్రోత్సాహాలను గుర్తించి.. విశాఖపట్టణంలో కంపెనీ నెలకొల్పేందుకు సిద్ధమైంది. ఈ విషయాన్ని రెండు రోజుల కిందటే ప్రకటించింది. ఏపీ సీఎం చంద్రబాబు, ఐటీ మంత్రి నారా లోకేశ్ పరిశ్రమల ఏర్పాటును ప్రోత్సహిస్తున్న నేపథ్యంలో మిట్టల్ కంపెనీ విశాఖపై దృష్టి పెట్టింది.
Comments